Saturday, November 23, 2024

రబీ సాగుకు రైతుబంధు జోష్ !

- Advertisement -
- Advertisement -

పుంజుకున్న సాగు విస్తీర్ణం
బారీగా పెరిగిన పప్పు శనగ పంట
60శాతం చేరిన పల్లి విత్తనం

మనతెలంగాణ/హైదరాబాద్ : రైతుబంధు నిధుల విడుదలతో రబీపంటల సాగుకు జోష్ పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు రోజలుగా రైతుల ఖాతాలకు రైతుబంధు నిధులు జమ చేస్తూ వస్తోంది. ఎకరానికి పెట్టుబడి సాయంగా రూ.5 వేలు అందజేస్తోంది. చేతికి నిధులు అదగానే రైతుల్లో రబి పంటల సాగుపట్ల ఉత్సాహం పెరిగింది.రాష్ట్రంలో ఈ సీజన్ కింద ప్రధాన ఆహార పంటలు , పప్పుధాన్య పంటలు , నూనెగింజ పంటలు , వాణిజ్య పంటలు అన్ని కలిపి మొత్తం 54.93లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయించాలని వ్యవసాయశాఖ ప్రాధమిక అంచనాలు రూపొందించుకుంది. ఇందులో రబీ అదను కాలం ప్రారంభమయ్యాక ఇప్పటివరకూ 7.82లక్షల ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలు పడాల్సివుంది. గత ఏడాది కూడా ఈ సమాయానికి 7.69లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి.

ఈ సారి రబిసాగు మరింత ఉత్సాహంగా సాగుతోంది. ఇప్పటివరకూ 7.97లక్షల ఎకరాల్లో విత్తనాలు పడ్డాయి. సాధారన సాగు విస్తీర్ణంలో ఇప్పటికే అన్ని రకాల పంటలు కలిపి 14.52శాతం విస్తీర్ణంలో సాగులోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. రైతులు వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా , అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున ఆరుతడి పంటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. వరి మినహా మిగతా పంటల విస్తీర్ణత వేగంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకూ సాగులోకి వచ్చిన 7.79లక్షల ఎకరాల విస్తీర్ణంలో 7.52 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో పప్పుధాన్య పంటల విస్తీర్ణం 2.51లక్షల ఎకరాలకు చేరుకుంది . రబీలో మొత్తం 4.21లక్షల ఎకరాల్లో పప్పుధాన్యపంటలు సాగు చేయించాలని లక్షంగా పెట్టుకోగా , ఇందులో ఇప్పటివరకూ 2.87లక్షల ఎకరాల్లో పప్పుశనగ ,23వేల ఎకరాల్లో మునుము విత్తనం పడింది. కంది 1600 ఎకరాలు, పెసర్లు 2029 ఎకరాలు, ఉలవ 121 ఎకరాల్లో సాగు చేశారు.
1.68 లక్షల ఎకరాల్లో వేరుశనగ
నూనెగింజల పంటసాగు విస్తీర్ణం కూడా పెరుగుతూ వస్తోంది. వేరుశనగ 2.77 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని లక్షంగా పెట్టుకోగా, ఇప్పటికే 1.68లక్షల ఎకరాల్లో వేరుశనగ విత్తనం పడింది. పొద్దుతిరుగుడు 7070 ఎకరాలు , నువ్వులు 7679 ఎకరాలు , కుసుమలు 480 ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. అన్ని రకాల నూనెగింజ పంటలు మొత్తం 1.84లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ నెలాఖరు నాటికి సాగు విస్తీర్ణం పూర్తిస్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.

40.50లక్షల ఎకరాల్లో వరిసాగు లక్ష్యం
రాష్ట్రంలో రబి సాగు కింద ఈ సారి 40.50లక్షల ఎకరాల్లో వరిసాగు చేయించాలని వ్యవసాయశాఖ లక్షంగా పెట్టుకుంది. ఈ సమయానికి 40వేల ఎకరాల్లో వరినాట్లు పడాల్సివుంది. గత ఏడాది కూడా ఈ సమయానికి 11746 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడ్డాయి.అయితే రైతులు ఈ సారి రైతుబంధు నిధులు చేతికందటంతో ఉత్సాహంగా సాగుపనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 76,043 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. గోధుమ 2515 ఎకరాలు, జొన్న 34947 ఎకరాలు, మొక్కజొన్న 2.02లక్షల ఎకరాలు, సాగులోకి వచ్చాయి. ఇక నుంచి వరినాట్లు మరింత వేగం పుంజుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. ప్రధాన వాణిజ్య పంటలసాగుకు సంబంధించి పొగాకు సాగు విస్తీర్ణం 5629 ఎకరాలు లక్షంగా పెట్టుకోగా ఇప్పటివరకూ 3120 ఎకరాల్లో పొగాకు నాట్లు పడ్డాయి. ఇతర వాణిజ్య పంటలు అన్ని కలిపి 41వేల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News