జైపూర్ : రాజస్థాన్‌లో జనవరి 5న జరగనున్న కరణ్‌పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా రూపీందర్ సింగ్ కుమార్‌ను ఆ పార్టీ ప్రకటించింది. కరణ్‌పూర్ అసెంబ్లీ అప్పటి ఎమ్‌ఎల్‌ఎ గుర్మీత్ సింగ్ కపూర్ చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక అని వార్యమైంది. దీంతో గుర్మీత్ సింగ్ కపూర్ కుమారుడు రూపీందర్ సింగ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ గురువారం వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థితోపాటు మరో 11 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి సురేంద్రపాల్ సింగ్ టిటి పోటీలో ఉన్నారు.
ఈ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు డిసెంబర్ 19 ఆఖరి తేదీ కాగా, 20న స్క్రూటినీ 22లోగా నామినేషన్ల ఉపసంహరణ ఉంటాయి. జనవరి 5న పోలింగ్ , 8న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2.40 లక్షల మంది ఓటర్లు ఉండగా పోలింగ్ స్టేషన్లు 249 వరకు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 199 నియోజకవర్గాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో 115 స్థానాలు బిజెపి కైవసం కాగా, కాంగ్రెస్‌కు కేవలం 69 స్థానాలే లభించాయి.