హైదరాబాద్: కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను ఎస్‌ఓటి ఎల్‌బి నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 360 కిలోల గంజాయి, కారు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ కోటి రూపాయలు ఉంటుంది. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, జిల్లా భగ్‌పత్ జిల్లా, బరనవా గ్రామానికి చెందిన వికాస్ త్యాగి, మీరట్‌కు చెందిన అక్బర్, ఎండి అమ్రిద్దిన్ కలిసి రాజమండ్రి నుంచి గంజాయిని ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నారు. ప్రధాన నిందితులు వికాస్ త్యాగి, అమ్రిద్దిన్ స్నేహితులు. వీరు ఘజియాబాద్‌కు చెందిన గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు ఎపిలోని రాజమండ్రి నుంచి గంజాయి తీసుకుని ఉత్తరప్రదేశ్‌కు వస్తే భారీగా కమీషన్ ఇస్తానని చెప్పాడు.
దీనికి ఇద్దరు నిందితులు అంగీకరించారు. అతడి ఆదేశాల మేరకు కారులో గంజాయి రవాణా చేసేందుకు రాజమండ్రికి వచ్చారు. అక్కడ ఓ వ్యక్తి నుంచి 360 కిలోల గంజాయిని తీసుకుని కారులో లోడ్ చేసుకున్నారు. దానిని తీసుకుని హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు బయలు దేరారు. ఈ విషయం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులకు సమాచారం వచ్చింది. ఓఆర్‌ఆర్ సమీపంలోని సంపూర్ణ హోటల్ వద్దకు రాగానే నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులు గతంలో కూడా నాలుగు సార్లు గంజాయిని రవాణా చేశారు. నిందితులు కారుతో పట్టుబడకుండా ఉండేందుకు వేరు కారు ఫాస్ట్ టాగ్ స్టిక్కర్‌ను అంటించుకుని వెళ్లేవారు.