Thursday, January 23, 2025

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు మరో 10 రోజుల గడువు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శివసేన(యుబిటి), ఎన్‌సిపి దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం గడువును మరో 10 రోజుల పాటు పొడిగించింది. తొలుత డిసెంబర్ 31 లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు తాజాగా వచ్చే ఏడాది జనవరి 10 వరకు గడువును పొడిగించింది. పిటిషన్లకు సంబంధించిన వాదప్రతివాదనలు డిసెంబర్ 20వ తేదీకి ముగుస్తాయని, వీటిపై నిర్ణయం తీసుకునేందుకు తనకు మరికొంత వ్యవధి కావాలని స్పీకర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. దీంతో జనవరి 10వ తేదీ లోగా తీర్పు చెప్పాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.

శివసేనకు ఉద్ధవ్ థాక్రే వర్గం, ఎన్‌సిపికి చెందిన శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయాన్ని స్పీకర్ త్వరితంగా తీసుకునేలా ఆదేశాలు జారీచేయాలని ఆ రెండు పార్టీలు తమ పిటిషన్లలో సుప్రీంకోర్టును అభ్యర్థించాయి. 2022 జూన్‌లో ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో కొందరు శివసేన ఎమ్మెల్యేలు బిజెపితో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ నుంచి విడిపోయిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాక్రే వర్గం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్న కారణంగా త్వరితంగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News