న్యూఢిల్లీ: లోక్‌సభలో ఇటీవల చోటు చేసుకున్న తీవ్ర అలజడి ఘటనపై పార్లమెంటు ఉభయ సభలు శుక్రవారం దద్దరిల్లాయి. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో రాజ్యసభలో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఆందోళన సమయంలో ఆమ్ ఆద్మీపార్టీ సభ్యుడు రాఘవ్ చద్దా వ్యవహరించిన తీరుపట్ల రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభా కార్యక్రమాలను రద్దు చేసి ఈ నెల 13న ( బుధవారం) చోటు చేసుకున్న ‘భద్రతా వైఫల్యం’ ఘటనపై చర్చించాలని ప్రతిపక్ష ఎంపిలు పట్టుబట్టారు. అయితే ఇందుకు చైర్మన్ ధన్‌ఖడ్ నిరాకరించారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని సూచించారు.
ఇదే సమయంలో రాఘవ్ చదా ్దపాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తేందుకు చేతులతో సంజ్ఞలు చేశారు. దీంతో చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు‘ మిస్టర్ చద్దా..పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తేందుకు అలా చేతులతో సైగలు చేయాల్సిన అవసరం లేదు. మీరేదయినా అడగాలనుకుంటే నోటితో అడగండి. మీరు చాలా నేర్చుకోవాలి. వెళ్లి మీ సీట్లో కూర్చోండి. ఇప్పటికే ఒకసారి సభ మిమ్మల్ని శిక్షించింది’ ఈ ఏడాది వర్షాకాల సమావేశాల సందర్భంగా చద్దాపై సస్పెన్షన్ వేలు పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై వచ్చిన ఆరోపణలపై రాజ్యసభ హక్కుల కమిటీ విచారణ జరిపింది. తప్పుదోవ పట్టించే అంశాలను మీడియాకు అందించడం,ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీకి సభ్యుల అంగీకారం లేకుండానే వారి పేర్లను జాబితాలో చూపించడం అంశాల్లో చద్దాను దోషిగా కమిటీ దోషిగా తేల్చింది.అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన శిక్షగా ఆయనకు విధించిన సస్పెన్షన్ సరిపోయినట్లు భావించి చద్దాపై విధించిన సస్పెన్షన్‌ను రాజ్యసభ ఎత్తివేసింది.