Monday, December 23, 2024

జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆస్తులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై మాజీ ఎంపి హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే జగన్‌తో పాటు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. అయితే ప్రతివాదులు అందరికీ ఇప్పటికీ నోటీసులు అందలేదు. ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటో పిల్ రూపంలో విచారిస్తోంది. ఈ ప్రజాప్రతినిధుల కేసుల సుమోటో పిల్‌ను, జగన్ కేసులపై దాఖలైన పిల్‌తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది.

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను ఎన్నికలలోపు పూర్తి చేయాలని మాజీ ఎంపి చేగొండి హరిరామ జోగయ్య తన పిటిషన్‌లో కోరారు. జగన్‌కు చెందిన ఇంకా 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు చేగొండి హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలపై సిబిఐ తరఫు న్యాయవాది స్పందించారు. డిశ్చార్జి పిటిషన్ల పెండింగ్‌పై సిబిఐ కోర్టులో మెన్షన్ చేసినట్టు తెలంగాణ హైకోర్టు దృష్టికి తెలియజేశారు. ఇరు వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి పిటిషన్లపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సిబిఐని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. జగన్‌పై పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ గతంలో ప్రతి శుక్రవారం జరిగేది. సిఎంగా బాధ్యతలు చేపట్టక ముందు వరకూ ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరయ్యేవారు. అయితే సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ కారణాలు, అధికారిక బాధ్యతల కారణంగా విచారణకు హాజరు కావడం లేదు. మధ్యలో కోవిడ్ కారణంగా కోర్టు విచారణ నిలిచిపోయింది. ఆ తర్వాత శుక్రవారం కూడా విచారణ జరగడం లేదు. అందుకే త్వరగా విచారణ చేపట్టాలని హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎపి హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసును
సిబిఐ చేపట్టింది. వైెస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారని సిబిఐ కేసులు నమోదు చేసిది. ఎపికి చెందిన పలువురు ప్రముఖ వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో రిపోర్టులో 58 కంపెనీలు, 13 మంది వ్యక్తుల పేర్లను నమోదు చేసి 2012 మే 27న సిబిఐ జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జగన్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో
సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏళ్లు గడుస్తున్న అక్రమాస్తుల కేసులో ట్రయల్స్ ఇంకా ప్రారంభం కాలేదు. నిందితులు కోర్టుల్లో వివిధ రకాల పిటిషన్లు వేసి విచారణను అడ్డుకుంటున్నారని సిబిఐ పలుమార్లు కోర్టులో వాదించింది. గతంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలో పూర్తి కావాలని సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది. అయినప్పటికీ కేసుల విచారణ మందుకు సాగకపోవడంతో హరిరామజోగయ్య హైకోర్టును ఆశ్రయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News