Saturday, December 21, 2024

మా కుమారుడు దర్మార్డుడు కాదు.. లలిత్ ఝా తల్లిదండ్రుల ఆవేదన

- Advertisement -
- Advertisement -

దర్భంగ: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేయగా ఈ కుట్రకు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝా తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడు ఈ పని చేశాడంటే నమ్మలేకపోతున్నారు. లలిత్‌ఝా తండ్రి దేవానంద కోల్‌కతాలో పూజారిగా పనిచేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న బీహార్‌లోని తమ పూర్వీకుల ఇల్లు ఇప్పుడు దేశ ప్రజల దృష్టిలో పడడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. నా కుమారుడి అరెస్టు గురించి ఇతరుల ద్వారా నాకు తెలిసింది. మీరే చూడండి మా ఇంట్లో టివి కూడా లేదు అని దర్భంగ జిల్లాలోని రాంపూర్ ఉదయ్ అనే కుగ్రామంలోని తన ఇంటి వద్ద జర్నలిస్టులకు ఆయన చెప్పారు. ఆయన భార్య మంజుల ఇంకా షాక్ నుంచి తేరుకున్నట్లు కనపడలేదు. ఆమె రోదనల మధ్యనే తన కుమారుడు దుర్మార్గుడు కాదని చెప్పారు. అతను ఎప్పుడూ తప్పు చేసేవాడు కాదని, ఇతరులకు సాయపడడాన్ని ప్రేమించేవాడని ఆమె తెలిపారు. మూడు సార్లు రక్తదానం కూడా చేశాడని ఆమె చెప్పారు.

డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన జరిగిన తర్వాత రాజస్థాన్‌కు పారిపోయిన 33 ఏళ్ల లలిత్ ఝా గురువారం రాత్రి ఢిల్లీ పోలీసులకు లొంగిపయాడు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరుపరచగా వారం రోజుల పోలీసు కస్టడీని కోర్టు విధించింది. డిసెంబర్ 10న కోల్‌కతా నుంచి తన తల్లిదండ్రులు బీహార్‌లోని దర్భంగకు రైల్లో బయల్దేరగా అలిత్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో లలిత్‌ఝాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తుండగా వీటిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు.

తమ కుమారుడి గురించి వెలువడుతున్న ఊహాగానాల గురించి లలిత్ తల్లిదండ్రులను విలేకరులు ప్రశ్నించగా తమ కుమారుడు తెలివైన విద్యార్థని వారు చెప్పారు. ట్యూషన్లు చెబుతూ తమ ఆర్థికంగా ఆదుకునేవాడని, ఛత్ పండుగ కోసం తామంతా దర్భంగాకు రావలసి ఉందని, కాని రైలు టికెట్లు లభించకపోవడంతో తమ వార్షిక సందర్శననను వాయిదా వేసుకున్నామని వారు తెలిపారు. మమల్ని సాగనంపడానికి లలిత్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఏదో పని మీద ఢిల్లీ వెళుతున్నానని, కొద్ది రోజుల్లో తాను దర్భంగాకు వస్తానని చెప్పాడు.

సామాజిక ఉద్యమాలలో పాల్గొనడం, ఎన్‌జిఓలతో సంబంధాలు ఉండడం వాస్తవమే అయినప్పటికీ లలిత్‌కు రాజకీయాలతో సంబంధమే లేదు అని అతని తండ్రి తెలిపారు. మీ కుమారుడిని యుఎపిఎ చట్టం కింద అరెస్టు చేశారని, బెయిల్ రావడానికి చాలాకాలం పడుతుందని విలేకరులు చెప్పగా లలిత్ తల్లిదండ్రులు పెద్దపెట్టున రోదించారు. మా కుమారుడిని క్షమించి వదిలిపెట్టాలని కోర్టును వేడుకుంటాం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లలిత్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతాడంటే మేము నమ్మలేము అని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News