Friday, December 20, 2024

ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు

- Advertisement -
- Advertisement -

‘ఆప్’ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. సీసన్స్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డా. హరి చరణ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ దిడ్డి సుధాకర్ ప్రారంభించి మాట్లాడుతూ ఆప్ పాలిత రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజలకు విద్య, విద్యుత్, నీరు, వైద్యం ఉచితంగా అందజేస్తున్నారని పేర్కొన్నారు.

మధుమేహం వంటి దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సహాయం రూ.10 లక్షలకు పెంచడం అభినందనీయమే కానీ మొత్తం వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందజేయాలని అయన కోరారు. సీసన్స్ హాస్పిటల్స్ యాజమాన్యం ఆప్ కార్యాలయంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వివిధ టెస్టులు చేసి, ఔషధాలు ఉచితంగా అందించడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్య రక్షణకు కృషి చేయాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ విజ్ఞప్తి చేసారు.

డా. హరి చరణ్ మాట్లాడుతూ నేడు మనం తీసుకునే ఆహారం, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇతర కాలుష్యాల వల్ల ప్రతి ఒక్కరు అనారోగ్యాల బారిన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యం పట్ల నిర్లక్షం వద్దని సూచించారు. ప్రతిఒక్కరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, పుట్ట పాండురంగయ్య, అధికార ప్రతినిధులు ఆఫస, పరీక్షణ్, జావీద్ షరీఫ్, మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి హేమ జిల్లోజు, నర్సింగ్ యమునా గౌడ్, నేతలు రాకేష్ సింగ్, కొడంగల్ శ్రీనివాస్, శ్రీకాంత్, జైసింగ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.

AAP medical camp

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News