ముంబై : గడిచిపోతున్న ఈ ఏడాది 2023లో పలు కలువరం కల్గించే పరిణామాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్ నారిమన్ అభిప్రాయపడ్డారు. ఈ కలవర కారక అంశాలలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా కొన్ని ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు, కొలీజియం వ్యవస్థ వంటి వాటిని ఆయన పేర్కొన్నారు. ముంబైలో ఆసియాటిక్ సొసైటీ సదస్సులో ఆయన కానిస్టూషన్ ః చెక్ అండ్ బ్యాలెన్సెస్‌అనే అంశంపై ఉపన్యసించారు. 2023 సంవత్సరం గతించిపోతోంది. అయితే కలకాలం కలవరం కల్గించే ఘటనను వదిలివెళ్లుతోందన్నారు. పలు చేదు జ్ఞాపకాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు తీర్పులలో ప్రధానంగా ఆర్టికల్ 370 రద్దు సబబు అంశం, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లు ఆమోదం , జడ్జిల బదిలీలు, నియామకాల కొలిజియం వ్యవస్థ వ్యవహారాలు వంటివాటిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అన్నింటికంటే తనకు బాగా కలిచివేసింది ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు అని విశ్లేషించారు.
నిజానికి సుప్రీంకోర్టు ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. దీనికి బదులుగా ఇందుకు విరుద్ధంగా ధర్మాసనం ఏకంగా రాజ్యాంగ వ్యతిరేక చర్యకు అనుమతిని ఇచ్చినట్లు అయిందని ఈ మాజీ న్యాయమూర్తి నిరసన వ్యక్తం చేశారు. ఓ వైపు మీరు ఈ ప్రధాన విషయంపై ఓ నిర్ణయానికి రాలేకపొయ్యారు. ఇదే దశలో పూర్తిగా ఓ వైపు ఇది సబబే అంటూ పరోక్షంగా నిర్ణయించేశారు. దీనితో ఓ రాజ్యాంగ వ్యతిరేక చర్య నిరవధిక స్థాయిలో సాగేందుకు అవకాశం కల్పించారని ఈ తీర్పు గురించి మాజీ న్యాయమూర్తి స్పందించారు. అదే విధంగా రాష్ట్రపతి పాలన సంబంధిత ఆర్టికల్ 356 (5)ని అధికారిక వ్యవస్థ ఉల్లంఘించింది. ఇవన్నీ కూడా మనోస్తానికి దారితీసే విషయాలు అవుతాయని వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర స్థాయి హోదా విషయంలో సొలిసిటర్ జనరల్ ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అయితే అప్పటి సొలిసిటర్ కల్పించిన హామీని పాటించే అవసరం ఏ విధంగా కూడా తరువాత వచ్చిన ప్రభుత్వానికి కానీ లెజిస్లేచర్‌కు కానీ లేదని దీనిని సుప్రీంకోర్టు తీర్పులో పట్టించుకోలేదని మాజీ న్యాయమూర్తి తెలిపారు.