థానే : మనసారా ప్రేమిస్తున్నానని చెప్పాడు, పూర్తిగా నమ్మించాడు. అయితే ఆయనకు అప్పటికే పెళ్లి అయిందని తెలిసింది. ఇదేమిటని నిలదీస్తే , తనను కారుతో ఢికొట్టి చంపేందుకు యత్నించాడని థానేకు చెందిన ప్రియాసింగ్ అనే యువతి వాపోతోంది. తన ప్రియుడు అనిల్ గైక్వాడ్ జరిపిన దాడి గురించి ఆమె ఇప్పుడు వివరించింది. మహారాష్ట్ర రాష్ట్ర రవాణా అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు అయిన అశ్వజిత్ గైక్వాడ్ గురించి ఈ 26 ఏండ్ల యువతి శనివారం వార్తా సంస్థలకు తెలిపింది. థానే బిజెవైఎం అధ్యక్షుడు కూడా అయిన అశ్వజిత్ తనను నమ్మించి మోసగించాడని పేర్కొంది.
తనను ప్రేమిస్తూ వచ్చిన గైక్వాడ్ పెళ్లి గురించి తనకు ఇటీవలే తెలిసిందని, తనకు పెళ్లికాలేదని చెప్పి , సహజీవనం చేసిన ఆయనను పెళ్లి విషయంపై నిలదీశానని , దీనితో తగవు జరిగిందని , తరువాత కారుతో ఢీకొట్టించి, చంపించేందుకు యత్నించాడని, ఈ క్రమంలో తనకు తీవ్ర గాయాలు అయ్యాయని ప్రియా తెలిపింది. కాళ్లు చేతులకు తీవ్రగాయాలతో ఇప్పుడు కదలలేని స్థితిలో ఉన్నానని వాపోయింది. ఇటీవలే తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని , ఎటువంటి చర్యా తీసుకోలేదని, తరువాత తాను సామాజిక మాధ్యమాలను ఆశ్రయించగా ఇప్పుడు కదలిక వచ్చిందని తెలిపారు. తనకు న్యాయం జరగాల్సి ఉందని, అశ్వజిత్ వంటి మేకవన్నె పులులను శిక్షించాల్సి ఉందని ఈ యువతి విజ్ఞప్తి చేసింది.