Tuesday, December 24, 2024

లాజిస్టిక్స్ ‘అచీవర్స్’ కేటగిరీలో మరోసారి ఎపి, తెలంగాణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, చండీగఢ్ సహా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2023 లాజిస్టిక్స్ ఇండెక్స్ జాబితాలో మరోసారి ‘అచీవర్స్ ’ కేటగిరీలో చోటు సంపాదించుకున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి, ఆర్థికాభివృద్ధికి అవసరమైన లాజిస్టిక్ సేవలకు గుర్తుగా ఉండే ఈ జాబితాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది. గత ఏడాది ఈ కేటగిరీలో 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కేటగిరీలో చోటు సంపాదించగా ఈ ఏడాది అది 13కు తగ్గింది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆస్పిరేటర్స్, ఫాస్ట్ మూవర్స్ కేటగిరీల్లోకి దిగజారడంతో గత ఏడాది జాబితానుంచి రెండు రాష్ట్రాలు తగ్గాయి. కాగా కొత్తగా సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు ఫాస్ట్ మూవర్స్ కేటగిరీనుంచి అచీవర్స్ కేటగిరీలోకి మారాయి.

అచీవర్స్ జాబితాలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఢిల్లీ, అసోం, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి, కాగా ఫాస్ట్‌మూవర్స్ కేటగిరీలో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, అండమాన్, నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు ఆస్పిరేటర్స్ కేటగిరీలో చేరాయి. రాష్ట్రాల మధ్య లాజిస్టిక్( రవాణా) పనితీరును మెరుగుపర్చడంపై దృష్టిపెట్టడంతో పాటుగా రవాణా ఖర్చులను తగ్గించడం ఈ సూచీ ముఖ్య ఉద్దేశమని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ జాబితాను విడుదల చేస్తూ చెప్పారు.2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 35 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడంలో లాజిస్టిక్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News