రాష్ట్రం దివాళా తీయలేదు – దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు!
గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉంది
అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దివాళా తీయలేదని, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కె.టి.రామారావు మండిపడ్డారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల పక్షాన ఉంటామని, ప్రజల తరఫున గొంతు విప్పి మాట్లాడుతామని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో సత్యదూరమైన మాటలు కనిపించాయని దుయ్యబట్టారు. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, ప్రజల ఆకలి కేకలు తప్ప మరేమి లేవని కెటిఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడుతుంది కానీ, ఆస్తుల గురించి మాట్లాడటం లేదని పేర్కొన్నారు. అప్పులను, ఆస్తులను వేర్వేరుగా చూడొద్దని చెప్పారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అప్పులు చేశామని, దాంతో సంపద సృష్టించామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందని ఆర్‌బిఐ తెలిపిందని చెప్పారు. యాదాద్రి ఆలయం, బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు, నూతన కలెక్టరేట్ భవనాలు, చివరకు ప్రస్తుత ప్రభుత్వం పాలన జరిపే అంబేద్కర్ సచివాలయం కూడా తమ ప్రభుత్వమే కట్టిందని వెల్లడించారు. 24 గంటల కరెంట్ కోసం అప్పులు చేశామని చెప్పారు. ఒక్క ఏడాది కూడా క్రాప్ హాలీడే ఇవ్వని ఘనత కెసిఆర్‌కు దక్కుతుందని వ్యాఖ్యానించారు. తమ పాలనలో జరిగిన అప్పులు గురించే చెబుతున్నారని, కానీ తాము సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదని విమర్శించారు.
గవర్నర్ ప్రసంగంలో పౌరసరఫరాల శాఖ గురించి అబద్ధాలు చెప్పారని అన్నారు. నిరుద్యోగుల ఆంశంలో ఆత్మహత్యలు తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్ పేర్కొన్నారు. విద్యుత్ వినియోగంలో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని తెలిపారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్పా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ట్రాన్స్‌కో ఆస్తులు రూ.24,470 కోట్లు, జెన్ కో రూ.53,963 కోట్లు సృష్టించామని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని, రూ.1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించామని వెల్లడించారు. అప్పులు చూపించి గృహజ్యోతి పథకం నుంచి తప్పుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణపై పరాయి పెత్తనం ఎట్టి పరిస్థితుత్లో సహించబోం
ఏటా కాగ్ నివేదికను సభ్యులకు ఇచ్చామని, కాగ్ నివేదిక శ్వేతపత్రం కాదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను పట్టడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. 2014లో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే తమ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించిందని కెటిఆర్ తెలిపారు. వైద్యరంగంలో 2014 నీతి అయోగ్ ర్యాంకు 11వ స్థానంలో ఉంటే 2023లో మూడో స్థానానికి వచ్చిందని వెల్లడించారు. తమ చేపట్టిన చర్యల వల్ల మతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని తమ మీద కక్షతో హైదరాబాద్ ఫార్మా సిటీని రద్దు చేయవద్దని కోరారు. తెలంగాణ కోసమే తమ పార్టీ పుట్టిందని, తెలంగాణనే ఆశగా శ్వాసగా పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణపై పరాయి పెత్తనం ఎట్టి పరిస్థితుత్లో సహించబోమని హెచ్చరించారు. “ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాటించి తరిమికొట్టు….ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంత పొలిమేరలోనే బొంద పెట్టు” అన్న కాళోజీ కవితను కెటిఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఢిల్లీ, కర్నాటక నుంచి తెలంగాణను రిమోట్‌తో నడిపించాలనుకుంటే ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని కెటిఆర్ హెచ్చరించారు.