ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంకు మాతృక, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకొనే మనం ౠప్రజాస్వామ్య దేవాలయం’గా భావించే పార్లమెంట్ లో ఉగ్రదాడి తరహాలో దాడి జరగడం దేశ ప్రజల అందరికి సిగ్గుచేటు. మన భద్రతా, నిఘా వ్యవస్థల నిర్లిప్తతను ఈ ఉదంతం వెల్లడి చేస్తుంది. 140 కోట్ల మంది ప్రజల సార్వభౌమత్వ అధికారంకు కేంద్రంగా భావించే వ్యవస్థపై దాడి జరగడం దిగ్భ్రాంతికరమైన అంశం. పైగా, సరిగ్గా 22 ఏళ్ల క్రితం పార్లమెంట్ జరిగిన ఉగ్రదాడిలో అమరులకు ఉపరాష్ట్రపతి జగదేవ్ జక్కర్, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు నివాళులు అర్పించిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరగడం అనూహ్యం. దాడి జరిగిన తీరు చూస్తుంటే ఇదొక్క ౠమిలిటరీ ఆపరేషన్’ మాదిరిగా జరిగిందని ఓ సీనియర్ మాజీ సైనికాధికారి చెప్పారు.
సాధారణంగా వీధులలో జరిగే నిరసన ఆందోళనల సందర్భంగా అవివేకంతో అప్పటికప్పుడు జరిపిన తుంటరి దాడి వంటిది కాదు. సంవత్సరంకు పైగా సన్నాహాలు చేస్తూ, అధికార పార్టీకి చెందిన ఎంపీ నుండే పాస్ లు పొంది, ఎంతో వ్యూహాత్మకంగా జరిపిన దాడి. ఇది చేసిన బృందానికి భద్రతా విధానం, దానిలో లొసుగుల పట్ల పూర్తి అవగాహన ఉన్నట్లు స్పష్టమవుతుంది. లోక్ సభ ఛాంబర్ లోకి 15 అడుగులు దూకేందుకు వారు తగు శిక్షణ పొంది ఉండాలి.
బయట నినాదాలు చేసేవారికి, లోపల దుశ్చర్యకు పాల్పడేవారికి మధ్య నెలకొన్న సమన్వయం కూడా మిలిటరీ ఖచ్చితత్వంను వెల్లడి చేస్తుంది. అనుకున్న ప్లాన్ ఎ విఫలమైతే ప్లాన్ బి తో కూడా ఉన్నట్లు పోలీస్ దర్యాప్తు వెల్లడి చేసింది. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు కేవలం రాజకీయ అంశాలపై నిరసనలు తెలిపేందుకు చేసిన సాధారణ ఆందోళన కానేకాదు.
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత భద్రతా వలయం గల భవనంలో ఇటువంటి దుశ్యర్యకు పాల్పడ్డారంటే మన భద్రతా, నిఘా వ్యవస్థల వైఫల్యాన్ని స్పష్టం చేస్తుంది. భద్రతా వైఫల్యాలను గుర్తించే ప్రయత్నం చేయకుండా దాడికి పాల్పడిన వారి రాజకీయ నేపధ్యాలపై ఎక్కువగా చర్చ జరిపే ప్రయత్నం చేయడం, పార్లమెంట్ సెక్యూరిటీలో కొద్దిమందిని సస్పెండ్ చేయడం చూస్తుంటే వైఫల్యంకు బాధ్యత వహించాల్సిన కీలక వ్యక్తుల నుండి దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టం అవుతుంది.నూతన పార్లమెంట్ భవనంను కొద్దీ నెలల ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తూ ఇక్కడ అత్యున్నతమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు. గ్యాలరీలో నుండి ఛాంబర్ లోకి తేలికంగా దూకే సౌలభ్యం ఉన్నదంటే భద్రతా అంశాలలో తీవ్రమైన లోపాలు నెలకొన్నట్లు భావించాల్సి ఉంటుంది.
ప్రస్తుత దాడి జరిగేందుకు మూడు రోజుల ముందు ఆర్టికల్ 370 రద్దు గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే ఆ విధంగా తీర్పు ఇవ్వడం తమ ప్రభుత్వం సాధించిన ఘనవిజయం అన్నలంటూ క్షణాలలో స్పందనలు తెలియచేస్తూ, 2024 ఎన్నికలకు కీలక ప్రచార అస్త్రంగా మలచుకొని ప్రయత్నాలు ప్రారంభించిన ప్రధాని, హోమ్ మంత్రి వంటి వారు ఇటువంటి దారుణమైన అవమానకర దాడి గురించి మౌనం వహించడం విస్మయం కలిగిస్తుంది.ఈ దాడి పట్ల పార్లమెంట్ లో అన్ని పార్టీల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అసలేమీ జరిగిందో అనే విషయమై ప్రధాని, హోమ్ మంత్రుల నుండి ప్రకటనలు కరోతు, దుర్ఘటనపై చర్చ జరగాలని పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులను సభల నుండి బహిష్కరిస్తూ ప్రభుత్వం స్పందించడం గమనిస్తుంటే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయ్నతాలు చేస్తున్నట్లు వెల్లడి అవుతుంది. దాడి గురించి టివి ఛానల్స్ లో మాట్లాడుతూ పార్లమెంట్ కు హోమ్ మంత్రి మొఖం చాటేయడం విస్మయం కలిగిస్తుంది.ఈ దుర్ఘటన జరగగానే సిఆర్ పిఎఫ్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ఓ దర్యాప్తు బృందాన్ని హోమ్ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. 22 ఏళ్ళ క్రితం కూడా అటువంటి ఓ బృందాన్ని ఏర్పాటు చేయడం, ఆ బృందం సిఫార్సుల మేరకు పార్లమెంట్ భద్రతలో అనేక మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మరికొన్ని మార్పులు చేయవచ్చు. అయితే, మన భద్రతా, నిఘా వ్యవస్థలలో వైఫల్యాలకు ఎవ్వరూ బాధ్యత వహించరా?
వాజపేయి మంత్రివర్గంలో నాటి హోమ్ మంత్రి ఎల్ కె అద్వానీని ౠఅపర సర్దార్ పటేల్’ అంటూ ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి గత 50 ఏళ్లలో దేశంలోని హోమ్ మంత్రుల అందరిలో ౠఅత్యంత విఫలమైన హోమ్ మంత్రి’ ఆయనే అని చెప్పవచ్చు. అంతకన్నా దారుణమైన అపఖ్యాతి యుపిఎ హయాంలోని శివరాజ్ పాటిల్ కు దక్కుతుంది. ముంబై ఉగ్రదాడిలో ప్రాణనష్టం ఎక్కువగా ఉండేందుకు ఆయనే బాద్యుడు.ఢిల్లీలోని అత్యున్నత భద్రతాధికారులు వెంటనే స్పందించి ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు అప్పటికప్పుడు ఓ ప్రత్యేక విమానంలో కమాండోలను పంపారు. అయితే, భద్రతా నియమాలను ఉల్లంఘిస్తూ ఆ విమానంలో తాను కూడా వస్తానని అంటూ వేచి ఉండమని శివరాజ్ పాటిల్ వారు ఆలస్యంగా బయలుదేరేందుకు కారణమయ్యారు.తీరా ముంబై విమానాశ్రయంకు అర్ధరాత్రి చేరుకోగా ప్రోటోకాల్ ప్రకారం తనకు స్వాగతం పలికేందుకు మహారాష్ట్ర మంత్రులు ఎవ్వరూ రాలేదు అంటూ వారు వచ్చేవరకు రెండు గంటలపాటు విమానం నుండి ఎవ్వరిని దిగనీయలేదు. హోమ్ మంత్రి ఆ విమానంలో లేకపోతే కమెండోలు రాత్రి 12 గంటలకన్నా ముందే తాజ్ హోటల్ కు చేరుకొని చాలామంది ప్రాణాలు కాపాడి ఉండేవారు.ఇక, హోమ్ మంత్రిగా అమిత్ షా ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేసే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని రాజకీయ ప్రత్యర్దులపై దాడులు జరపడంలో ఆరితేరారు గాని, భద్రతా వ్యవహారాలపై ఆయనకు పట్టుకున్నట్లు కనబడటం లేదు.
ఆయన హోమ్ మంత్రి అయిన కొత్తలోనే ఢిల్లీలో మూడు రోజుల పాటు అల్లర్లు చెలరేగి, పోలీసులు తమ ముందే విధ్వంసాలు జరుగుతున్నా, ప్రైవేట్ వ్యక్తులు కాల్పులు జరుపుతున్నా మౌనంగా ఉండిపోయిన అవమానకరమైన దృశ్యం చూసాము. కళ్ళముందు అల్లర్లు జరుగుతుంటే తుపాకీ ఉపయోగించని పొలిసు అధికారులు ఘోరమైన నేరంకు పాల్పడినట్లు కాగలదు.
ఇక మణిపూర్ లో జరుగుతున్న మారణహోమం విషయంలో సహితం భద్రతా వైఫల్యాలను స్పష్టం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న క్రిమినల్ న్యాయ చట్టాల గురించి ప్రకటన చేస్తూ బ్రిటిష్ అణచివేతకు చిహ్నంగా మిగిలిన ౠరాజద్రోహం’ చట్టాన్ని తొలగిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. అయితే, ఆ చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఉపయోగించినంత విశృంఖలంగా స్వాతంత్య్రం అనంతరం ఎప్పుడూ ఉపయోగించలేదు.కేవలం కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు, నిరసనలు తెలిపినందుకు జర్నలిస్టులు, సామజిక కార్యకర్తలను సహితం విచారణ లేకుండా జైళ్లకు పరిమితం చేశారు. ఈ అనుభవాల నేపథ్యంలో పార్లమెంట్ పై జరిగిన దాడిని పరిశీలిస్తే భద్రతా, నిఘా వ్యవస్థలు రాజకీయ అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తూ తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు భావించాలి వస్తుంది.
ఈ దాడికి కొద్దీ రోజుల ముందు ఖలీస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ పార్లమెంట్‌ను పునాదులతో సహా కదలిస్తామని అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే, ఈ బెదిరింపులను ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్టు లేదని తాజా ఘటనతో రుజువైందనే విమర్శ వినిపిస్తోంది. ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వారికి న్యాయసాయం కోసం రూ 10 లక్షల బహుమతి ని అతను ప్రకటించాడు. భారత ప్రజాస్వామ్య పునాదులను కదిలించిన వారికి న్యాయసాయం కోసం రూ 10 లక్షలు రివార్డ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.అంటే, ఈ దాడి ఆషామాషీగా జరిగింది కాదని, లోతయిన కుట్ర, ఉగ్రవాద చర్య అందులో ఇమిడి ఉందని గ్రహించాలి. ఇప్పుడు పోలీసులకు పట్టుబడినవారు కేవలం పైపై ముఖాలే అని, అసలు కీలక వ్యక్తులు వేరే ఉన్నారని గమనించాలి. ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు సహితం సమగ్రంగా, వ్యవస్థాగత లోటుపాట్లను గుర్తించే విధంగా ఉండాలి. అంతేకాదు, అందుకు బాధ్యులను కూడా గుర్తించాలి.కార్గిల్ యుద్ధం తర్వాత దేశంలో బహుశా మొదటిసారిగా మన భద్రతా వ్యవస్థలో లోటుపాట్లపై లోతయిన అధ్యయనం నరసింహన్ కమిటీ జరిపింది. దేశ చరిత్రలోనే ఈ విచారణ బహిరంగంగా, పారదర్శకంగా జరిగింది. మన సైనిక, నిఘా, భద్రతా వ్యవస్థలలో లోటుపాట్లపై బహిరంగంగా చర్చలకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత నిర్దిష్టమైన సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సులతో ఇంకా అనేకం అమలు నోచుకోవాల్సి ఉన్నాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా మన పార్లమెంట్ భద్రతపై బహిరంగంగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి.
* చలసాని నరేంద్ర
9849569050