జలమండలి ఎండీ దానకిషోర్ బదిలీ..
ఆయన హయాంలో బోర్డుకు ప్రత్యేక మార్క్
బోర్డు చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎండీగా రికార్డు
కీలక ప్రాజెక్టులు, సంస్కరణలకు శ్రీకారం
ఆయన సారథ్యంలో బోర్డుకు అవార్డుల పంట
జలమండలి నూతన ఎండీ గా సుదర్శన్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: జలమండలి ఎండీగా గ్రేటర్ ప్రజలు విస్తృత సేవలందించిన దాన కిషోర్ బదిలీ అయ్యారు. ఆయన పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పదోన్నతిపై వెళ్లనున్నారు. హెచ్‌ఎండీఏ, సీఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానంలో సి. సుదర్శన్ రెడ్డి, ఐఎఎస్ నూతన ఎండీ గా నియమితులయ్యారు. 1996 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన దానకిషోర్ 2016 ఏప్రిల్ 7 న జలమండలి ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఏకధాటిగా 2023 డిసెంబరు 17 వరకు ఎండీగా కొనసాగారు.
జలమండలి చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన మేనేజింగ్ డైరెక్టర్‌గా రికార్డు సృష్టించారు. ఐటీ, రెవెన్యూ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారు. నగర ప్రజలకు వేసవి లోనూ తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకున్నారు. నగరంలో 100 శాతం మురుగు శుద్ధి చేయాలనే సంకల్పంతో ఎస్టీపీలు, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఆయన కాలంలో నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలతో తనదైన మార్కు చూపించారు. తన పనితీరుతో బోర్డుకు అనేక అవార్డులు తెచ్చిపెట్టారు. ఆయన నాయకత్వంలో బోర్డు పనితీరు, ప్రతిష్ఠను మరింత పెంచారు. వినియోగదారుల, అధికారుల, ఉద్యోగుల అభిమానాన్ని చూరగొన్నారు.
ప్రాజెక్టులు – సంస్కరణల వివరాలు:
హడ్కో ప్రాజెక్టు ద్వారా రూ.1900 కోట్లతో నగర శివారులో 56 రిజర్వాయర్ల నిర్మాణం.
మొండి బకాయిల వసూలుకు ఓటీఎస్ పథకం.
స్లమ్ వినియోగదారులకు రూపాయికే నల్లా కనెక్షన్ మంజూరు.
ఇంకుడు గుంతల ప్రాముఖ్యం తెలిపేందుకు వాక్ కార్యక్రమం, విస్తృతమైన అవగాహన కల్పన.
నీటి విలువ తెలిపేందుకు.. జలం జీవం కార్యక్రమం.
క్షేత్ర స్థాయిలో జరిగే పనుల పర్యవేక్షణకు ఎస్పీటీ బృందాల ఏర్పాటు.
తాగునీటి సరఫరా, స్టోరేజీ, ట్రాన్స్‌మిషన్, పంపింగ్ అంశాల్లో ఐఎస్‌ఓ ధ్రువపత్రం.
హైదరాబాద్ నగరానికి నిరంతర తాగునీటి సరఫరాకు ‘ రింగ్ మెయిన్‘ ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం.
2020 లో హైదరాబాద్ పౌరులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగు నీరు.
హైదరాబాద్ లో 100 శాతం మురుగు శుద్ధి లక్ష్యంగా రూ.3866 కోట్లతో 32 ఎస్టీపీల నిర్మాణం.
లాక్ డౌన్ సమయంలో నగర ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా, సమర్థమైన మురుగు నీటి నిర్వహణ. ఉద్యోగులకు టీకాలు.
ఆయన హయాంలో జలమండలికి పలు అవార్డులు:
గ్లోబల్ వాటర్ అవార్డు, హడ్కో అవార్డు, వాటర్ కన్వర్జేషన్ అవార్డు, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ అవార్డు, టీఎస్ ఐపాస్ అవార్డు, వాటర్ ప్లస్ అవార్డు, పీఆర్‌ఎస్‌ఐ జాతీయ అవార్డులు, ఉత్తమ యాజమాన్య అవార్డు, అమృత్ టెక్నాలజీ ఛాలెంజ్ అవార్డు, స్కోచ్ అవార్డు, వరల్ వాటర్ అవార్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవార్డు ఉత్తమ ఎస్టీపీతదితర అవార్డులు ఆయన హయంలోనే వచ్చాయి.