జాతర నిర్వహణకు రూ. 75 కోట్లు విడుదల
ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గిరిజనులు ఆరాధ్యదైవంగా కొలుస్తున్న సమ్మక, సారక్క మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. ఆదివారం మేడారంలో పర్యటించి త్వరలో నిర్వహించబోయే జాతరపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినంతరం మీడియాతో మాట్లాడుతూ జాతర నిర్వహణకు రూ. 75 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, ఇంత తక్కువేనని కొంతమంది అడగొచ్చు కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. జాతర సజావుగా జరిగేందుకు ప్రణాళిక చేసినట్లు పనులు శాశ్వత ప్రాతిపదికన చేయనున్నట్లు పారిశుద్దం , ట్రాఫిక్, ఆర్టీసీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలపై దృష్టి సారించామన్నారు. కేంద్రం జాతీయ హోదా ఇవ్వడంతో నిధుల కోసం ప్రతిపాదనలు పంపామని, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.