కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలతోనే రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఓటమి
మా పార్టీతో పొత్తు వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌కు విజయం : సిపిఐ నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఐతో పాటు అందరినీ కలుపుకుని పోవడంతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ఈ ఎన్నికలను ఎఐసిసి ఒక గుణపాఠంగా తీసుకుని, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అందరినీ కలుపుకెళ్లాలని సూచించారు. రాబోయే లోక్ ఎన్నికల్లో తెలంగాణ, ఎపి రెండు రాష్ట్రాల్లో ఒక్కో స్థానంలో సిపిఐ పోటీ చేయబోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలతోనే రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఆ పార్టీ ఓడిపోయిందని , ప్రమాదకరమైన బిజెపి అధి కారంలోనికి వచ్చిందన్నారు. కాంగ్రెస్ తప్పిదాలే బిజెపిని గెలిపించాయన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్య వర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డితో కలిసి హైదరాబాద్ మగ్ధుం భవన్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ ఇండియా కూటమి ఎంత అవసరమో,ఆ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకుపోవడం కూడా కాంగ్రెస్ అత్యంత ముఖ్యమని సూచించారు.
మితిమిరిన అహంకారం, ఎవరినీ కలుపుకోలేదని.. అందుకే ఓటమి పాలయ్యారన్నారు. చత్తీస్ బస్తర్ ఏడు నియో జకవర్గంలో బలంగా ఉన్న సిపిఐకి కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా ఇవ్వలేదన్నారు. తమకు ఒక్క సీటు ఇచ్చిన బస్తర్ కాంగ్రెస్ సానుకూలంగా మారేదన్నారు. వామపక్షాన్ని అణచివేయాలనే ఉద్దేశంతోనే సిపిఐకి జాతీయ గుర్తింపును తొలగించారని దుయ్యబట్టారు. రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలలో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తమకు పార్టీ కార్యాలయాలు, పూర్తి సాయి కార్యకర్తలు (హోల్ టైమర్లు) ఉన్నారని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోకుండా సాంకేతిక కారణాల పేరుతో తమ జాతీయ గుర్తింపును తొలగించారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం రెండు, మూడు రాష్ట్రాలు మినహా దేశంలో ఎక్కడా లేదని, అయినా ఆ పార్టీకి జాతీయ గుర్తింపు ఇచ్చారని గుర్తు చేశారు. వామపక్ష తీవ్రవాదం పేరుతో సాంకేతిక కారణాలను చూపుతూ సిపిఐని దెబ్బకొట్టారన్నారు. బస్తల్ తమకు పార్టీ గుర్తింపును కేటాయించాలని ఎన్నికల కమిషన్ లేఖ రాసినా ఆలస్యంగా వచ్చిందని గుర్తును కేటాయించలేని, తాము కుండ గుర్తును అడిగితే, గిరిజన ప్రాంతాల్లో ఎవరికీ తెలియన ఎసి గుర్తు ఇచ్చారని మండిపడ్డారు. అయినా కేవలం మూడువేల ఓట్ల తేడాతోనే తాము ఓడిపోయామని వివరించారు. ఎన్నికల అవగాహనలో భాగంగా రాజస్థాన్ సిపిఎం ఉన్న రెండు సిట్టింగ్ సీట్లు, సిపిఐ రెండు సీట్లు అడిగినా ఇవ్వలేదని, సిపిఐ, సిపిఎంను కలుపుకుంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చేదని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో అందరినీ కలుపుకుని పోవడంతో గెలిచారని గుర్తు చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో సిపిఐ పోటీ
రాబోయే లోక్ ఎన్నికలలో కేరళలో నాలుగు, తమిళనాడులో రెండు, పశ్చిమ బెంగల్ మూడు, చత్తీస్ గడ్ బస్తర్ పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కో లోక్ సభ స్థానంలో సిపిఐ పోటీ చేయనున్నట్టు నారాయణ వెల్లడించారు. ఎన్నికల అవగాహనలో భాగంగా మధ్యప్రదేశ్ ఒక్క స్థానంలో సిపిఐకి అఖిలేష్ యాదవ్ మద్దతునిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల అవగాహన కుదిరితే సరేనిన, లేదంటే కలిసొచ్చే వామపక్ష, లౌకిక శక్తులతో కలిసి పోటీ చేస్తామని నారాయణ వెల్లడించారు. ఇటీవల ఎన్నికల్లో జరిగిన పరిణామాలను ఇండియా కూటమి సమావేశంలో ప్రాస్తవను తీసుకురావాలని తాము సిపిఐ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఇక రిటైర్డ్ అధికారులొద్దు
నిపుణులు, మంచి అనుభవం ఉన్నదనే పేరుతో రిటైర్డ్ అధికారులను తిరిగి ఉద్యోగంలోనికి తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నారాయణ సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ఇబ్బండిపడుతున్న ఆటోవాలలకు నిర్ధిష్టమైన ప్రణాళికను రూపొందించి, వారికిన్యాయం చేయాలని కోరారు. పర్యాటక శాఖ కార్యాలయంలో ఉద్దేశపూర్వకంగా ఫైల్స్ కొన్ని రికార్డులను తగులబెట్టారని, ఈ ఘటనపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర హోం మంత్రిపై ‘ఉపా’ కేసు పెట్టండి
పార్లమెంట్ దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారు బిజెపికి చెందిన ఎంపి పాస్ వచ్చారని, ఒక వేళ వారు తమ పార్టీ లేదా, ముస్లిం ఎంపి పాస్ వచ్చి ఉంటే దేశంలో పరిస్థితులు దారుణంగా ఉండేవని నారాయణ వ్యాఖ్యానించారు. బతికి ఉండగానే ఎపి ముఖ్యమంత్రి జగన్ సమాధి కట్టుకున్నారని నారాయణ అన్నారు. ఆంధ్రపదేశ్ కూడా అధికార మార్పిడి ఖాయమని చెప్పారు. ధరణి పేరుతో మాజీ సిఎం కెసిఆర్ చేసిన మోసం కంటే జగన్ ఎక్కువ తప్పులు చేస్తున్నారని విమర్శించారు. పాస్ జగన్ తన పోటోలు ఎందుకని, శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా అని ఎద్దేవా చేశారు. ప్రజలలో జగన్ పట్ల వ్యతిరేకతగా ఉన్నారని, తెలుగు ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా ఉంటే, ఆయన మాత్రం బిజెపికి అనుకూలంగా ఉన్నారన్నారు.
శాసనసభ, లోక్ ఎన్నికల ఫలితాలు ఒకేలా ఉండవు : అజీజ్ పాషా
సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఒకే తరహా ఉండబోవని, ఇది వరకు జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. ఇటీవల రాజస్థాన్, చత్తీస్‌గఢ్, యుపి ఎన్నికల ఫలితాల ఆధారంగా రాబోయే లోక్‌సభ కూడా బిజెపి విజయం సాధిస్తుందని కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రసారం చేయడాన్ని తప్పుపట్టారు. గత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికలకు తేడా కనిపించిందని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపికి అతి తక్కువ శాతంతోనే విజయం సాధించిందన్నారు.
‘భూ సమస్యల’పై అఖిపక్ష సమావేశాన్ని నిర్వహించండి: చాడ వెంకట్ రెడ్డి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జఠిలమైన భూ సమస్య పరిష్కారానికి రెవెన్యూ నిపుణులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని సిఎం రేవంత్‌ని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు వారితో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆహాంభావ వ్యవహార శైలితోనే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని, ఇప్పటికైనా ఆ పార్టీ నిర్మాణాత్మక పాత్రను పోషించాలని హితువు పలికారు. అందరూ కలిసి ఐఖ్యంగా వెళ్తే ఫలితాలు వస్తాయని ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలే నిరూపించాయని ఎఐసిసి నేతలకు సూచించారు.