హైదరాబాద్ వాసులకు పాత పుస్తకాల లభ్యత గురించి ఎలాంటి ఫికరు లేదు. చదవడం పట్ల ఆసక్తి ఉన్న వారి కోసం తక్కువ ధరలో పాత పుస్తకాలు అమ్మే దుకాణాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. ఆదివారం వచ్చిందంటే అబిడ్స్ సర్కిల్‌లో మూసి ఉండే షాపుల ఫుట్ పాత్‌లపై ఎన్నో సెకండ్ హ్యాండ్ బుక్స్ కొలువు తీరుతాయి. కొత్త ముద్రణలతో అందుబాటులో లేని ఎన్నో విలువైన పుస్తకాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఒక్కోసారి ప్రసిద్ధ రచయితలు కోడిలా తల కింది కేసుకొని ఏదో పుస్తకం కోసం వెతుకులాడుతూ కనబడుతారు. ఓ రచయిత ప్రముఖుడి పేరు రాసి మర్యాదగా ఇచ్చిన పుస్తక ప్రతి ఉన్న దున్నట్లుగా కనబడి అయ్యో పాపం అనిపిస్తుంది. నడుస్తూ నడుస్తూ ఇలాంటి వింత అనుభవాలను కూడా కనవచ్చు. రోజు కాళ్లాడే చోట వారానికొకసారి ప్రపంచ జ్ఞానం పరిచుండే ఈ దృశ్యాన్ని సండే స్పెషల్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనొచ్చు. ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థుల కోసం కోరినన్ని పాత టెక్ట్ బుక్స్, రెఫెరెన్స్ పుస్తకాలు కోఠి సెంటర్‌లో దొరుకుతాయి. చదువైపోయాక అమ్మేసే విద్యార్థుల పుస్తకాలు ఆయా కోర్సుల్లో చేరే వారికి డిస్కౌంట్ ధరలకు లభిస్తాయి. అలా ఆ సబ్జెక్టుకు డిమాండ్ ఉన్నంత కాలం ఆ పుస్తకం చేతులు మారుతూనే ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా పాత పుస్తకాల అమ్మకాల సందడి ఉండే ఉంటుంది.
నగరాలకు దూరంగా ఉన్నవారి కోసం లేదా పాత పుస్తకాల ప్రదర్శనకు రాలేనివారి కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఆ పుస్తకాలతో రకరకాల వెబ్ సైట్లు ఆన్‌లైన్ అమ్మకాలు చేపడుతున్నాయి. వాటిలో చెన్నైకి చెందిన ‘యూజ్డ్ బుక్స్ ఫ్యాక్టరీ’ ఒకటి. దీనిని 30 ఏళ్ల తిలక్ దేసింగ్ అనే యువకుడు నడుపుతున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన తిలక్ శని, ఆదివారాల్లో ఈ ఫ్యాక్టరీ పనుల్లో నిమగ్నమైతాడు.తనకు తోడుగా ఆయనకు తల్లిదండ్రులు కూడా ఇందులో పాల్గొంటారు. తాను ఐఐటి కి తయారవుతున్న రోజుల్లో చెన్నైలోని అన్ని పాత పుస్తకాలు షాపుల చుట్టూ కావలసిన బుక్స్ కోసం తిరగవలసి వచ్చింది. దాని కోసం ఎంతో సమయం వృథా అయ్యేది. ఆ కష్టం కొందరికైనా తగ్గించేందుకు ఉద్యోగంలో చేరాక ఎందరో ఫ్రెండ్స్ దగ్గర వున్న పుస్తకాలను స్వయంగా తీసికెళ్ళి అవసరమున్న విద్యార్థులకు అందజేసేవాడు. అలా సెలవుల్లో విశ్రాంతి తీసుకోకుండా ఒక్కోసారి పది మంది ఇళ్ళకి వెళ్లి బుక్స్ అందజేసేవాడు.
కొన్నాళ్ల తరవాత తాను సేకరించిన పుస్తకాలను ఒఎల్‌ఎక్స్‌లో పెట్టి కోరిన వారికి ఫ్రీగా పంపేవాడు. ఈ పంపిణి కోసం ఒక ఇ కామర్స్ లాంటి వ్యవస్థ అవసరమని భావించి స్వయంగా 2017లో మొదట ‘చెన్నై యూజ్డ్ బుక్స్ డాట్ కామ్’ ఆరంభించాడు. ఈ డొమైన్ ను రిజిస్ట్రీ చేయడానికి రూ. 1000/- ఖర్చయింది. అదే ఆయన పెట్టుబడి. చెన్నైలో తమ వద్దనున్న బుక్స్ అవసరమున్నవాళ్లు తీసికెళ్ళేలా లొకేషన్ మ్యాప్‌తో ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. విచిత్రమేమిటంటే తీసికెళ్ళేవారి కన్నా తమ వద్ద పాత పుస్తకాల ఎన్నో వున్నాయి, వాటిని ఫ్రీగా మీకు పంపిస్తామని అడిగేవాళ్ళు ఎక్కువయ్యారు. దాంతో అనవసరపు పుస్తకాల తెప్పించకుండా కొన్ని విధానాలు పెట్టాడు.
చినికిపోయిన, అయిదేళ్ల కన్నా పాత పుస్తకాలు, సిలబస్ మారిన టెక్ట్ బుక్స్ వద్దని చెప్పడం జరిగింది. అవేవి పాటించకుండా కొందరు పంపడంతో మీ వద్దనున్న పుస్తకాల ముఖచిత్రం ఫోటో తీసి పంపితే వాటిలోంచి ఎంపిక చేసుకుంటామని మరో నిబంధన పెట్టడం జరిగింది. పుస్తకాల పంపిణీ కోసం తక్కువ ధరకు కొరియర్ సంస్థలతో ఒప్పందాలు చేసుకొన్నాడు. దూరప్రాంతాలకు పంపే పుస్తకాలకు వాటి ధర కన్నా కొరియర్ ఖర్చు ఎక్కువయ్యేది.ఒక్కోసారి జమ్మూ కశ్మీర్ దాకా పంపవలసి వచ్చేది. అలా సేకరించిన లక్షకు పైగా పుస్తకాల కోసం ప్రత్యేకంగా ‘యూజ్డ్ బుక్స్ ఫ్యాక్టరీ’ అనే ఆన్‌లైన్ సేల్స్ వ్యవస్థను ఆరంభించాడు.
ఈ పంపిణీ వ్యాపారంగా మారడంతో తిలక్ తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి కాలం దీనికే వినియోగిస్తున్నారు.ఇప్పుడు పది లక్షల పుస్తకాల సామ్రాజ్యం ఆయనది. ఒక స్టేట్ లైబ్రరీ స్థాయిలో చెన్నైలో నాలుగు అంతస్తుల్లో ఈ పుస్తకాలు అక్షర క్రమంలో సర్ది వున్నాయి. ఫిక్షన్, నాన్ ఫిక్షన్, కిడ్స్, ఎడ్యుకేషన్ ఇలా పుస్తకాలను విభజించారు. పుస్తకాలు ధర తక్కువే కాకుండా ఫ్రీ డెలివరీ వుంటుంది. 10-12 పుస్తకాలు ధర రూ.999/-, 25 పుస్తకాలకు రూ. 1999/-, 40 పుస్తకాలకు రూ. 2999/- మాత్రమే చెల్లించాలి. రచయిత, పుస్తకం పేరును సైట్లో ఎంపిక చేసుకోవచ్చు.ప్రస్తుతానికి ఇంగ్లీష్ పుస్తకాల అమ్మకాలు వీరు నిర్వహిస్తున్నారు. హిందీ, తమిళ పుస్తకాల సేకరణ జరుగుతోంది. దేశంలోని సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మేవారి నుండి క్యాటలాగులు తెప్పించుకొని వారికి కూడా వ్యాపార వృద్ధిలో తోడ్పడుతున్నారు. ఆన్‌లైన్ వ్యాపారంతో పాటు ‘యూజ్డ్ బుక్స్ ఫ్యాక్టరీ’ తరఫున దక్షిణ భారతంలో పుస్తక ప్రదర్శన అమ్మకాలను ఆరంభించారు. ప్రతి ప్రధాన నగరానికి ఏడాదికి రెండు సార్లు వచ్చి పుస్తకప్రియుల అవసరాలను తీర్చుతున్నారు. ప్రదర్శనల్లో పుస్తకాలను అట్ట పెట్టెల సైజు ఆధారంగా అమ్ముతారు.
ప్రవేశ రుసుము లేదు. చిన్న పెట్టె ధర రూ.1199/-. ఇందులో 10 -12 బుక్స్ పడతాయి. మధ్యస్థ పెట్టె ధర రూ. 1799 /-, 30 పుస్తకాల పెట్టె పెద్ద పెట్టె ధర రూ.2999/-. 29 డిసెంబర్ 2023 నుండి 1 జనవరి 2024 వరకు హైదరాబాద్‌లో ఈ ప్రదర్శన ఉంటుంది. లక్డీకాపూల్ సమీపంలోని మారుతి గార్డెన్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని వారి సైట్లో ఉంది. పుస్తకమే మనిషి అభివృద్ధికి వారధి. రచయిత శారీరక శ్రమ, మేధోమథనంతో రూపొందిన పుస్తకం సమాజ వికాసానికి ఉద్దేశించబడింది. చదివి నేర్చుకోవలసిన విషయాలు మంచి పుస్తకంలో ఎన్నో ఉంటాయి. రోజు నాలుగు పేజీలైనా చదువుతామని చెప్పే విజ్ఞుల మాట ఆదర్శనీయం. ఇంగ్లీష్ అనగానే భయపడే అవసరం కూడా లేదు. ఇండియాకు చెందిన ఎందరో ఆంగ్ల రచయితలు మన సమాజం, మన జీవన విధానంపై సులభమైన రీతిలో రచనలు చేశారు. ఆంగ్ల పఠన ప్రవేశానికి అవి ఎంతో ఉపయోగపడతాయి. పుస్తకం చిక్కి శల్యమయ్యే దాకా విజ్ఞానాన్ని పంచుతానంటోంది. యూజ్డ్ బుక్స్ చినిగే దాకా యూజ్ ఫుల్ బుక్స్ అనిపించుకుంటాయి.
బి.నర్సన్
9440128169