Monday, December 23, 2024

ఢిల్లీలో సిఎం రేవంత్ బిజీబిజీ… ఏఐసిసి అగ్రనేతలతో భేటీ

- Advertisement -
- Advertisement -

ఎంపి ఎన్నికలు సహా, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, మంత్రివర్గ విస్తరణ చర్చ
ఇరు రాష్ట్రాల విభజన సమస్యల గురించి అధికారులతో సమావేశం
తొలిసారిగా ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని పరిశీలించిన రేవంత్

మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో సిఎం రేవంత్ బిజీ బిజీగా గడిపారు. సిఎం ఈ సందర్భంగా ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్‌తో ఆయన భేటీ అయినట్టుగా తెలిసింది. ఈ భేటీలో భాగంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహారించాల్సిన అంశాలపై సిఎం రేవంత్‌రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పిఏసి చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి అందించినట్టుగా సమాచారం. దీంతోపాటు ఇరు రాష్ట్రాల విభజన సమస్యల గురించి అధికారులతో సిఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ భవనం నిర్మాణంతో పాటు ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటాలకు సంబంధించి తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో సిఎం రేవంత్ చర్చించారు.

ఢిల్లీలోకి అధికారిక నివాసాన్ని పరిశీలించిన సిఎం
ఢిల్లీలో అధికార నివాసాన్ని సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ నంబర్ 23లో ఉన్న అధికారిక నివాసానికి సిఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. తొలిసారిగా అధికారిక నివాసానికి సిఎం రేవంత్ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నివాసాన్ని ఖాళీ చేయడంతో మంగళవారం సిఎం రేవంత్ ఈ ఇంటిని సందర్శించారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీలోని తుగ్లక్‌రోడ్డులోని ఈ బంగ్లాకు సిఎం వచ్చారు. దీంతోపాటు సిఎం రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు సమాచారం. సిఎం హోదాలో ప్రధానిని తొలిసారి మర్యాదపూర్వకంగా కలవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. తాజాగా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో సహకరించాలని ఇప్పటికే కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం రేవంత్ ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

ఆరు బెర్తుల కోసం డజను మంది పోటీ
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో పదవుల పంపిణీ ద్వారా పార్టీలో ఉత్సాహం తీసుకురావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో హోం శాఖ, విద్యాశాఖతో పాటు పలు కీలక శాఖలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కలేదు. మిగిలి ఉన్న 6 బెర్తుల కోసం దాదాపు డజను మందికిపైగా పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవల ఎన్నికల్లో ఓడిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఆరు బెర్తులపై ఇప్పటికే సిఎం ఈ విషయమై అధిష్టానానికి వివరించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News