మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో తమకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని బిఆర్‌ఎస్ శాసనసభాపక్షం స్పీకర్‌ను కోరింది. ఈ మేరకు బిఆర్‌ఎస్ శాసనసభా పక్షం తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు లేఖ రాశారు. బుధవారం నుంచి తిరిగి సమావేశం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక, విద్యుత్, నీటి పారుదల రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయనుంది. అందులో భాగంగా చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు, గణాంకాలు పేర్కొనాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రభుత్వం చెప్పే విషయాలకు ప్రధాన ప్రతిపక్షంగా తాము వివరణ ఇవ్వాల్సి ఉందని, దీంతో బుధవారం చర్చ సందర్భంగా ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, తమకూ అవకాశం కల్పించాలని బిఆర్‌ఎస్ కోరింది.