న్యూయార్క్ : బాలిస్టిక్ క్షిపణులను అక్రమంగా పరీక్షిస్తుండడమే కాకుండా, అభివృద్ధి చేస్తుండడంపై ఇరాన్‌ను పశ్చిమదేశాలు తీవ్రంగా ఆక్షేపించాయి. క్షిపణులతోపాటు వందలాది డ్రోన్లను రష్యాకు సరఫరా చేస్తున్నట్టు ఆరోపించాయి. యురేనియం నిల్వలను అనూహ్యంగా 60 శాతం పెంచుకున్నట్టు ఎండగట్టాయి. ఇవన్నీ 2015లో కుదిరిన అణు ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ధ్వజమెత్తాయి.
అయితే అమెరికా బలమైన మద్దతుతో బ్రిటన్, ఫాన్స్, జర్మనీ, చేసిన ఈ ఆరోపణలను ఇరాన్, దాని మిత్రదేశం రష్యా కొట్టి పారేశాయి. ఈమేరకు ఐక్యరాజ్యసమితి లోని ఇరాన్ రాయబారి అమీర్ ఇర్వానీ, రష్యా రాయబారి నెబెంజియా 2018 నాటి ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జెసిపిఒఎ) నుంచి అమెరికా వైదొలగడమే కాక,పశ్చిమదేశాలు ఆంక్షలు విధించడం, ఇరాన్ వ్యతిరేక వైఖరిని అవలంబించడాన్ని తూర్పారపట్టారు.
ఆగస్టు 2022 లో రద్దయిన ఈ ప్రణాళికను పునరుద్ధరించడానికి ప్రాథమిక చర్చలు జరిగాయి. సోమవారం నాడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో అమెరికా రాజకీయ వ్యవహారాల చీఫ్ రోస్‌మెరీ డికార్లో జెసిపిఒఎ విషయమై ఆలోచించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌పై ఒత్తిడి తెచ్చారు. ఇరాన్ అణుకార్యక్రమం శాంతి ప్రయోజనాల కోసమే సాగేలా చూడాలని అభ్యర్థించారు.