Saturday, December 21, 2024

స్వాతంత్య్ర యోధులే స్ఫూర్తిగా పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యానికి కుట్ర

- Advertisement -
- Advertisement -

భగత్ సింగ్, ఆజాద్ పేరిట వాట్సప్ గ్రూపుల ఏర్పాటు
తరచు చాటింగ్‌లు..వ్యూహ రచనపై నిందితుల చర్చలు
డ్యూప్లికేట్ సిమ్ కార్డుల కోసం పోలీసుల యత్నాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు నిందితులు స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ పేరిట ఏర్పాటు చేసుకున్న అరడజను వాట్సప్ గ్రూపులలో సభ్యులని పోలీసు వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఈ ఆరుగురు నిందితులతోపాటువాట్సప్ గ్రూపులోని ఇతర సభ్యులు స్వాతంత్య్ర సమరయోధుల ఆలోచనలు, సిద్ధాంతాలను తరచు చర్చించుకునేవారని, వీడియో క్లిప్‌లను కూడా షేర్ చేసుకునేవారని ఈ కేసు దర్యాప్తు అధికారులకు సన్నిహితులైన వర్గాలు తెలిపాయి.

డిసెంబర్ 13న పార్లమెంట్‌లో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సాగర్ శర్మ, మనోరంజన్ డి అనే ఇద్దరు వ్యక్తులు లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించి జీరో అవర్ జరుగుతున్న సమయంలో అక్కడి నుంచి సభ్యుల ఛాంబర్‌పైకి దూకారు. ఆ తర్వాత నినాదాలు చేస్తూ స్మోక్ బాంబులను ప్రయోగించారు. వారిని ఎంపీలు నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో అమోల్ షిండే, నీలమ్ అనే మరో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ప్రాంగణం వెలుపల తానాషాహీ నహీ చలేగీ(నియంతృత్వం సాగదు) అంటూ నినాదాలు చేస్తూ స్మోక్ బాంబులను ప్రయోగించారు.

ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝాతోపాటు మహేష్ కుమావత్ అనే మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అందరిపై కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యుఎపిఎ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పోస్టులను గమనిస్తే వారు విప్లవ నాయకుల నుంచి స్ఫూర్తిని పొందినట్లు అర్థమవుతోందని, పార్లమెంట్‌లో భగత్ సింగ్ చేసిన సాహస కృత్యాన్నే తాము కూడా చేయాలని వారు భావించి ఉంటారని వర్గాలు తెలిపాయి. ఈ వాట్సప్ గ్రూపులకు చెందిన సభ్యుల పేర్లు, వారు చాట్ చేసిన వివరాలను మేటా నుంచి పోలీసులు సంపాదించినట్లు వర్గాలు చెప్పాయి.

మైసూరులో ముందుగానే కలిసిన నిందితులు
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం సృష్టించడానికి సంబంధించిన వ్యూహాన్ని సిగ్నల్స్ యాప్ ద్వారా నిందితులు చర్చించుకున్నారని, గత ఏడాది కర్నాటకలోని మైసూరులో వారంతా కలుసుకున్నారని వర్గాలు వెల్లడించాయి. మైసూరుకు చెందిన మనోరంజన్ డి ఈ ఐదుగురి ప్రయాణ ఖర్చులు భరించాడని ఒక అధికారి తెలిపారు. రాజస్థాన్‌లో లలిత్ ఝా, కుమావత్ కాల్చివేసిన నలుగురు నిందితుల సెల్‌ఫోన్లకు సంబంధించిన డూప్లికేట్ సిమ్ కార్డుల కోసం పోలీసులు ప్రయగ్నిస్తున్నారు.

ఇలా ఉండగా గత శనివారం సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాళ్ సింగ్ సారథ్యంలోని దర్యాప్తు కమిటీ పార్లమెంట్ భద్రత, ఢిలీ పోలీసు అధికారుల సమక్షంలో నేర దృశ్యాన్ని మరోసారి ఆవిష్కరించింది. భద్రతా వైఫల్యానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్న కమిటీ లోపాలను గుర్తించి తదుపరి చర్యలను సిఫార్సు చేయనున్నది. యుఎపిఎ చట్టం కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News