అప్పులు, ఆదాయంపై చిట్టా విప్పనున్న ఆర్థిక మంత్రి
అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్
అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు నివేదన
ఆర్ధికశాఖా మంత్రి భట్టి కీలకోపన్యాసం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఆర్ధికశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆర్ధికశాఖామంత్రి భట్టి విక్రమార్క ఈనెల 20వ తేదీన (బుధవారం) అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. అసెంబ్లీ వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఆదాయం సమ్రగమైన నివేదికను సమర్పించేందుకు ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క కీలకోపన్యాసం చేయనున్నారు.
ఇలా రాష్ట్ర అప్పులు, ఆదాయాలను రాష్ట్ర ప్రజలకు వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయడంగానీ, ఆర్ధిక పరిస్థితిపై అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేయడంగానీ ఇదే తొలిసారి అని, బుధవారం ఆర్ధికశాఖా మంత్రి భట్టి విక్రమార్క సరికొత్త రికార్డును సృష్టించబోతున్నారని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేయడానికి ఉపక్రమించడం మూలంగా తమ ప్రభుత్వం పారదర్శకతతో పరిపాలనను సాగిస్తోందని ప్రజలకు స్పష్టంచేసేందుకు ఉపయోగపడుతోందని వెల్లడించారు.
2014లో కేవలం 75,577 కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని గత పాలకులకు అప్పగిస్తే ఇప్పుడు సుమారు అయిదు లక్షల కోట్ల రూపాయలకు అప్పులు పెరిగాయని, చేసిన అప్పులకు వడ్డీలు, ఇతర చెల్లింపులకు ఏటా సుమారు 22 వేల కోట్ల రూపాయలను చెల్లిస్తుండటంతో అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చేందుకే ఇప్పుడు అసెంబ్లీలో అప్పులు, ఆదాయంపైన ఆర్ధిక శాఖామంత్రి భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని ఆ అధికారులు వివరించారు. 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తం అప్పులు చేయలేదని అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు, లైవ్ ప్రసారంతో రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసిందని వివరించారు. అంతేగాక విద్యుత్తు రంగంలో గత ప్రభుత్వం ఏకంగా 85 వేల కోట్ల రూపాయల ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టిందని, ఆ భారం విద్యుత్తు శాఖ భరించలేని విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఆరోపణలు కూడా చేశారు. విద్యుత్ శాఖా మంత్రి కూడా అయిన భట్టి విక్రమార్క విద్యుత్తు సంస్థలైన డిస్కంలు తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయని పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రకటించారు కూడా. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు 4,02,684 కోట్లు కాగా విద్యుత్తు డిస్కంల అప్పులు 57,239 కోట్లు ఉందని, కాళేశ్వరం కోసం తీసుకొన్న అప్పులు రూ. 97,449 కోట్లు అని, మిషన్ భగీరథ కోసం తీసుకొన్న అప్పులు 23,984 కోట్ల రూపాయలని, ఈ మొత్తం అప్పులన్నింటినీ కలిపితే సుమారు 5,81,356 కోట్ల రూపాయల వరకూ అప్పులున్నాయని ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకేనని, అసెంబ్లీలో ఆర్ధిక శాఖా మంత్రి భట్టి విక్రమార్కకు ఆ శాఖాధికారులు మరింత లోతైన సమాచారం ఇస్తారు గనుక అప్పుల అంకెల్లో మార్పులు కూడా ఉండవచ్చునని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివరించారు.
ఇవి కాకుండా తమ దృష్టికి రాకుండా, మీడియా దృష్టికి రాకుండా, సివిల్ సప్లయీస్ కార్పోరేషన్, రవాణాశాఖ, మున్సిపల్, రెవెన్యూశాఖ, ఇతరత్రా మరికొన్ని విభాగాల్లోని భవనాలను, ఇతర ఆస్తులను కూడా తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని, వాటి వివరాలను కూడా ఆర్ధికశాఖా మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు కూలంకషంగా వివరించనున్నారని వివరించారు. ప్రభుత్వం నుంచే కాకుండా కార్పోరేషన్ల పేరుతో తీసుకొన్న అప్పులు కూడా భారీ ఉండటంతోనే గతేడాది కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ, రిజర్వు బ్యాంక్‌లు కలిసి తెలంగాణ రాష్ట్రానికి కొత్త అప్పులు చేయడానికి వీల్లేదని పేర్కొంటూ అప్పులపై కోత విధించిందని వివరించారు. అంతేగాక ఈ అప్పులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి-కాగ్) నివేదికలు, కాగ్ అక్షింతలు వేసిన వైనాన్ని కూడా మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వివరించనున్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులను అప్పులు తీసుకుని నిర్మించి, అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆ అప్పులు, వడ్డీలను చెల్లించడానికి ఉన్న మార్గమేమిటని కాగ్ తన నివేదికల్లో ప్రశ్నించిందని, దానికి గత ప్రభుత్వం ఎలాంటి సమాధానాలు ఇవ్వలేకపోయిందని, ఈ విషయాన్ని కూడా ఆర్ధికమంత్రి అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు వివరిస్తారని వెల్లడించారు. అంతేగాక మిషన్ భగీరథ పైన కాగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిందని, భగీరథ ఆదాయం రానటువంటి స్కీమ్ అని, దానిపై తీసుకొన్న అప్పులకు తిరిగి చెల్లింపులు ఎలా చేస్తారు, అందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలేమిటని కాగ్ నిలదీసిందనే విషయాన్ని కూడా మంత్రి సభకు వివరిస్తారని అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చేందుకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని, వాటిపైన వడ్డీల చెల్లింపులే ప్రభుత్వానికి గుదిబండగా మారిందని ఆర్ధికశాఖాధికారులు మంత్రి భట్టి విక్రమార్కకు టాకింగ్ పాయింట్స్‌లో కూలంకషంగా వివరించారని, ఆ పాయింట్స్ మొత్తం అసెంబ్లీలో ఆర్ధికమంత్రి తన ప్రసంగంలో వివరించనున్నారని తెలిపారు.