హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే రెండు రోజుల్లో 141 ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మండిపడ్డారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష ఎంపీలు నిలదీస్తే వారిని సస్పెండ్ చేసి అధికార బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి చేసి అరాచకం సృష్టించిందని డాక్టర్ ్డ సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. పార్లమెంట్‌లో విద్వంసం సృష్టించిన దోషులకు ప్రవేశ పాస్‌లపై సంతకం చేసిన బిజెపి ఎంపి ప్రతాప్‌సింహ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయకుండా, నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు.
చొరబాటుదారులు పార్లమెంటుపై దాడి చేశారు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం పార్లమెంట్, ప్రజాస్వామ్యంపై దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బిజెపికి ఏమాత్రం విశ్వాసంలేదని, మోడీ విపరీతమైన నియంతృత్వ ధోరణినవలంభిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దేశ ప్రజలకు స్పష్టంగా అర్థమౌతోందన్నారు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించి తరమికొడతారని డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరించారు.