Monday, December 23, 2024

హత్యాచార బాధితురాలిపై పోస్టు తొలగించండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. 2021లో హత్యాచారానికి గురైన ఒక మైనర్ దళిత బాలికిని బయటపెట్టిన సోషల్ మీడియా పోస్టును తొలగించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆ బాలిక గుర్తింపును పరిరక్షించాలని హైకోర్టు ఆదేశించింది. 2021 ఆగస్టు 1న అనుమానాస్పద పరిస్థితులలో మరణించిన ఒక 9 సంవత్సరాల దళిత బాలిక తన తల్లిదండ్రులతో కలసి తీసుకున్న ఫోటోను రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేశారు. వాయువ్య ఢిల్లీలోని పాత నంగల్ గ్రామంలో ఒక స్మశానవాటిక పూజారి తన కుమార్తెపై అత్యాచారం జరిపి, హత్య చేసి, దహనం చేశాడని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.

ఈ పోస్టును పురస్కరించుకుని రాహుల్ గాంధీ ఎక్స్ అకౌంట్‌ను సస్పెండ్ కాగా కొద్దిరోజుల తర్వాత పునరుద్ధరణ జరిగింది. ఈ పోస్టును ఎక్స్ డెలిట్ చేసినప్పటికీ భారత్ వెలుపల ఇది లభ్యతలోనే ఉందని పేర్కొన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ వెంటనే దీన్ని తొలగించాలని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. బాధితురాలి గుర్తింపును కాపాడాలంటే ఆ పోస్టునుప్రపంచమంతటా తొలగించాల్సినఅవసరం ఉందని కోర్టు తెలిపింది. బాధితురాలి ఫోటోను ప్రచురించి ఆమె గుర్తింపును బయటపెట్టినందుకు రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త మకరంద్ సురేష్ మడ్లేకర్ 2021లో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు తదుపరి విచారణ జనవరిలో జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News