షియోపూర్ ( ఎంపి ) : గత ఏడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తీసుకువచ్చిన మగ చీతాను బోను లోంచి కునో నేషనల్ పార్కు నయాగావ్ అడవి లోకి ఈనెల 20న ప్రవేశ పెట్టారు. దీంతో ఈ చీతాల సంఖ్య నాలుగుకు చేరింది. టూరిస్టులు ఈ మగ చీతా పావన్ తోపాటు మరో మూడు చీతాలను సందర్శించ వచ్చని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు 15 చీతాలను బోనుల్లో ఉంచారు. వీటిలో ఏడు మగవి కాగా, మిగతావి ఆడ చీతాలు. ఇవి ఆగస్టు నుంచి బోనుల్లో భద్రంగా ఉంటున్నాయి.
నమీబియా నుంచి వచ్చిన చీతాల్లో ఆరు చీతాలు, మూడు పిల్లలు అనేక కారణాల వల్ల చనిపోయాయి. ఇప్పుడు బుధవారం ఆడ చీతా వీరా ను నయగావ్ ఫారెస్ట్ రేంజిలో విడిచిపెట్టారు. దీనికన్నా ముందు అగ్ని, వాయు అనే మగ చీతాలను ఆదివారం పారోండ్ ఫారెస్ట్ రేంజిలో విడిచిపెట్టారు. చీతా సంతతి పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది సెప్టెంబర్ 17న ఎనిమిది చీతా పిల్లలను నమీబియా నుంచి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.