ఓయూలో మేనిఫెస్టో పత్రులు దగ్ధం చేసిన విద్యార్థులు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుందని ఓయూ విద్యార్ధి నేతలు మండిపడ్డారు. గురువారం యూనివర్శిటీలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దగ్ధం చేశారు.
ఈసందర్భంగా నిరుద్యోగ జెఎసి చైర్మన్ మానవతా రాయ్ మాట్లాడుతూ నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టి 15 రోజులు గడుస్తున్న సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గద్దెనెక్కిన తరువాత భృతి హామీని విస్మరించి గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తప్పులుగా వివరించి ఎన్నికల్లో ఇచ్చి వాగ్దానాలు పక్కదోవ పట్టేందుకు ఎత్తులు వేస్తున్నారని విమర్శించారు. రెండు నెలల్లో రూ.4 వేల నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామాకాల శ్వేత పత్రం విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో నిరుద్యోగ భృతి గురించి ప్రియాంక గాంధీ కూడా పలు సభల్లో హామీ ఇచ్చారని ఆమె మాటలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓయూ ముళ్ల కంచెలు తొలగింపు: విద్యార్ధి నేతలు
చాలా రోజుల తరువాత ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చుట్టూ ఉన్న ముళ్ల కంచెలు తొలగించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల పోరాటంతో ముళ్ల కంచెలు తీసివేసేందుకు ఓయూ అధికారులు ఒప్పుకున్నారని, దగ్గరుండి ముళ్ల కంచెలను ఓయూ అధికారులు, ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు తీయించినట్లు విద్యార్థులు తెలిపారు. క్యాంపస్‌పై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వందలాది మంది విద్యార్థులు లైబ్రరీ నుంచి అడ్మినిస్ట్రేషన్ భవనం వరకు నిరసన ర్యాలీ చేపట్టి విద్యార్థులు తమ సమస్యలు వినిపించకుండా విద్యార్థులు భవనంలోకి ప్రవేశంచకుండా బ్లాక్ చుటూ ఉన్న ముళ్ల కంచెలు తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన ఓయూ అధికారులు ముళ్ల కంచెలను తొలగించారు.