Monday, December 23, 2024

కొత్త వేరియంట్

- Advertisement -
- Advertisement -

ఏడాదిన్నర, రెండేళ్ళ క్రితం దేశాన్ని, రాష్ట్రాన్ని మృత్యుకూపాలుగా మార్చివేసి ఇంటింటిలోనూ కంటికి కునుకు లేకుండా చేసి పేద వర్గాల ప్రజలను అపూర్వమైన సంక్షోభంలోకి నెట్టివేసిన కరోనా (కోవిడ్ 19) గురించి గుర్తున్న వారికి ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఇప్పుడు దాని కొత్త వేరియంట్ జెఎన్1 ప్రబలుతున్నదనే వార్తలు ముమ్మరంగా బయలుదేరాయి. ఇది గమనంలో వుంచుకోదగినదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ఈ వార్తలు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్వపు కోవిడ్ విజృంభణలో భారత దేశంలో 4 కోట్ల 50 లక్షల మందికి అది సోకింది. 5 లక్షల 45 వేల మందిని బలి తీసుకొన్నదని అధికారిక సమాచారం తెలియజేసింది. వాస్తవంలో మృతుల సంఖ్య 15 లక్షల వరకు వుండవచ్చునని ప్రభుత్వేతర సర్వేలు వెల్లడించాయి. అది సృష్టించిన బీభత్సం గురించి చెప్పుకోడానికి మాటలు చాలవంటే అతిశయోక్తి కాబోదు. ప్రధాని నరేంద్ర మోడీ అత్యుత్సాహంతో అవ్యవధిగా ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ నిరుపేద వలస కార్మికులకు కలిగించిన కష్టాల గురించి ఎంతగా చెప్పినా మిగిలే వుంటుంది.

అలాగే లాక్‌డౌన్ వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు లక్షలాది ఉద్యోగాలు కోల్పోయి చిన్న, చితక వ్యాపార సంస్థలు మూతపడిపోయి దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం అంత ఇంత కాదు. అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సిలిండర్లను అందించడంలో కేంద్రం విఫలమైనందున మరెందరి ప్రాణాలో వున్నట్టుండి గాలిలో కలిసిపోయాయి. మానవ సంబంధాల్లో కోవిడ్ సృష్టించిన విధ్వంసం అంత ఇంత కాదు. ఇరుగు పొరుగు వారు, ఒకే కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ సోకిందంటే ముఖం చాటు చేసుకొన్నారు. గ్రామాల్లో కోవిడ్ మృతులను దహనం చేయనివ్వకుండా ఆ కుటుంబాన్ని దూరం చేసిన సందర్భాలున్నాయి. అటువంటిది ఇప్పుడు కొత్త వేరియంట్ జెఎన్1 పడగ విప్పుతున్నదంటే భయపడనివారుండరు. గోవా, మహారాష్ట్ర, కేరళ, కర్నాటకల్లో ఇది బయట పడినట్టు తెలుస్తున్నది. కొన్ని చోట్ల సామాజిక దూరాన్ని పాటించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. గతంలో కోవిడ్ ఫిబ్రవరి, మార్చిల్లో విరుచుకుపడింది. ఇప్పటి వేరియంట్ చలికాలంలో పొడచూపడంతో ఆందోళన చెలరేగుతున్నది. అప్పుడు వేసవి కాలం ముందు కోవిడ్ బయటపడడంతో అది ఉష్ణ ప్రాంతంలో నిలబడబోదని అనుకొన్నారు. వాస్తవం అందుకు విరుద్ధంగా జరిగింది.

ప్రస్తుత జెఎన్1 వేరియంట్ అత్యధికంగా ఫ్రాన్స్‌లో 20% మందికి, అమెరికాలో 14% మందికి, అలాగే సింగపూర్‌లో 14% మందికి సోకినట్టు చెబుతున్నారు. సోకిన ప్రతి వ్యాధిగ్రస్థులు ప్రతి ఒక్కరిలోనూ దాని లక్షణాలు కనిపిస్తాయి గాని అది తప్పనిసరిగా చావుని దాపురింప చేయదు. చాలా మంది ప్రాథమిక చికిత్సతో బయటపడతారు. ఊపిరితిత్తుల మీద ఇది ప్రభావం చూపిస్తున్నదని సమాచారం. ప్రభుత్వాలు తొందరపడి మితిమీరిన హెచ్చరికలు చేయడం వల్ల ప్రజలు భయభ్రాంతులవుతారు. ప్రైవేటు ఆసుపత్రులు డబ్బు చేసుకొంటాయి. జనానికి జబ్బు దవాఖానాలకు డబ్బు. అందుచేత ప్రభుత్వాలు ఆచితూచి హెచ్చరించవలసి వుంది. భయోత్పాతం పెరిగే కొద్దీ ముందుగా దెబ్బ తినేది రాకపోకలు. విమానయానానికి అవరోధాలు కలిగితే ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా మరొకసారి దెబ్బ తింటాయి. లాక్ అవుట్లు విరుచుకుపడితే తలెత్తబోయే సంక్షోభం ముందుగా చెప్పుకొన్నవే. అయితే ఇదేమంత ప్రళయం కాబోదని, భయపడవలసిన అవసరం లేదని వెలువడుతున్న అంచనాలు నిజమైతే పర్వాలేదు.

అయితే ముందు జాగ్రత్తగా టీకాలను సిద్ధంగా చేసుకోవలసి వుంటుంది. గతంలో ఈ టీకాల పంపిణీలో పేద దేశాల పట్ల తీవ్రమైన వివక్ష చూపారు. ఇప్పుడు కూడా అలా జరగబోదనే భరోసాకు ఆస్కారం కలగడం లేదు. మన దేశంలోనూ కోవిడ్ టీకాల విషయంలో చెప్పుకోదగిన రాజకీయమే జరిగింది. వాటి ఆర్థిక భారాన్ని తాను భరించబోమని ప్రధాని మోడీ ప్రభుత్వం కొంత కాలం భీష్మించుకొన్నది. ఆపత్కాలంలో మనుషులే కాదు దేశాలు కూడా ఒకరికొకరు తోడ్పడాలి. పరస్పర సహకారం పని చేయాలి. కాని గతానుభవం దేశాల మధ్య అటువంటి ఇచ్చిపుచ్చుకోడానికి అవకాశం లేదని చాటింది. ఈ వేరియంట్ నిజంగానే పెద్దదై ప్రమాదకారిగా మారితే గతం నుంచి గుణపాఠాలు నేర్చుకొని ప్రపంచం మానవతా దృష్టితో నడుచుకోవాలి. అది లోపిస్తే మనది మానవ ప్రపంచమని చెప్పుకొనే అర్హతను మనం కోల్పోతాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News