Saturday, November 23, 2024

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి డి. శ్రీధర్ బాబు ఎన్నిక

- Advertisement -
- Advertisement -

ఈసారి జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు ఎగ్జిబిషన్

మనతెలంగాణ/హైదరాబాద్:  నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ నేత, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. శుక్రవారం ఎగ్జిబిషన్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో శ్రీధర్ బాబును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నగరంలో నాంపల్లిలో ప్రతి ఏడాది జనవరిలో నూమాయిష్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి ఈ ఎగ్జిబిషన్‌లో 2వేలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. 2024 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ (ఏఐఐఈ) సొసైటీ 83వ వార్షిక నుమాయిష్ (ఎగ్జిబిషన్) నిర్వహించనున్నారు.

ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసే వ్యాపారులు ముందుగా దరఖాస్తు చేసుకుంటారు. వ్యాపారులు ఎంచుకునే స్థలాన్ని బట్టి సొసైటీ సభ్యులు అద్దె ధరను నిర్ణయిస్తారు. సుమారుగా రూ.75 వేల నుంచి లక్షా 50 వేల వరకు ప్రైమ్ లొకేషన్ ఆధారంగా అద్దె ఉంటుంది. స్టాల్స్ సైజు రిజిస్ట్రేషన్ ప్రకారం అద్దె వసూలు చేస్తారు. ఆసక్తిగల వ్యాపారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటారు. వినియోగదారుల కోసం నుమాయిష్ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల్లో స్మార్ట్ ఫోన్‌లలో యాప్ స్టోర్‌ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.

1938 నుంచి నుమాయిష్ హవా
స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రోత్సహించేందుకు 1938లో నుమాయిష్ ప్రదర్శనను అప్పటి హైదరాబాద్ స్టేట్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు. కేవలం 50 స్టాల్స్‌తో ప్రారంభిమైన ఈ ఎగ్జిబిషన్ అనతికాలంలోనే దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనల్లో ఒకటిగా పేరుగాంచింది. వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రజలకు చేరువయ్యేందుకు ఎగ్జిబిషన్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా, 1948లో హైదరాబాద్ సంస్థానం విలీనం వంటి సంఘటనల నేపథ్యంలో నుమాయిష్ రద్దయ్యింది. 1949లో ఈ నుమాయిష్ ప్రదర్శనను ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా పేరు మార్చి అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి. రాజగోపాలాచారి ప్రారంభించారు.

పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్ మెంట్ పార్క్
అనంతరం నుమాయిష్ 2021కి కరోనా ప్రభావంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నుమాయిష్ 2022 ప్రారంభమై మరుసటి రోజే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మూసి వేశారు. అయితే కొవిడ్ నిబంధనలు సడలించడంతో ఎగ్జిబిషన్‌ను తిరిగి 2022 ఫిబ్రవరి 20 నుంచి మార్చి నెలాఖరు వరకు నిర్వహించారు. పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్ మెంట్ పార్క్ ఉంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటయ్యే ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ పలు డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులను నడుపుతుంది. నాంపల్లి, గాంధీభవన్ మెట్రో స్టేషన్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు సమీపంగా ఉంటాయి. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్-, రాయదుర్గం మార్గాల్లో నడిచే మెట్రో రైళ్లను నుమాయిష్ ను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది అర్ధరాత్రి 12 వరకు రైళ్లను నడిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News