Sunday, December 22, 2024

ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో స్పష్టత లేదు: బిజెపి ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతప్రతాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులపై స్పష్టత లేదని బిజెపి ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ప్రభుత్వ సంస్ధలు, కార్పొరేషన్ నష్టాలపై చర్చ జరిపిందని, మరుసటి రోజు విద్యుత్‌పై చర్చ జరిపి చేతులు దులుపుకుందని బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఒక విధంగా ఉంటే శ్వేతపత్రంలో మరో విధంగా ఉందని, అప్పుల వివరాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలో విఫలమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఎందుకు చర్చ నిర్వహించలేదని, గతంలో తమ వద్ద సాక్షాలు ఉన్నాయని చెప్పిన కాంగ్రెస్ నేతలు విచారణకు ఫిర్యాదు చేసేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం విచారణ చేపట్టినా వాస్తవాలు బయటకు రావని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేంద్రానికి సీబీఐ విచారణకు కాంగ్రెస్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తమకంటే ఒక సీటు తక్కువ ఉన్న ఎంఐఎం నేతలకు మాట్లాడే సమయం ఎక్కువగా ఇచ్చారని, తమకు మాట్లాడేందుకు తక్కువ సమయం కేటాయించారని మండిపడ్డారు. దీనిపై అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిని ప్రశ్నించిన పట్టించుకోలేదని, మోటార్లకు మీటర్లు అని బిజెపిని బదనాం చేయాలని చూశారని, ఈ విషయంలో కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజం చెప్పారన్నారు. ఈ విషయంలో ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.

మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని బిజెపి చెప్పలేదని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారన్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ప్రసంగిస్తూ గత సర్కార్ ఖజానా ఖాళీ చేసిందన్న విషయం కాంగ్రెస్‌కు కూడా తెలుసని, మహాలక్ష్మి పథకంలో ఒక ఉచిత బస్సు మాత్రమే అమలు చేశారని, మిగిలినవి ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. పథకాలపై కాంగ్రెస్ నేతలు మోడీ ఫోటోను పెట్టడం లేదని, అక్బరుద్దీన్ సమయం దొరికినప్పుడల్లా బిజెపిపై విషం కక్కుతున్నాడని , ఎంఐఎం మతతత్వ పార్టీ అని తేలిపోయిందని, హిందువులంతా ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను త్వరగా అమలుచేయాలన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికే కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్లు ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు, యువత దగా పడ్డారని, జరిగిన ధ్వంసం, విధ్వంసాన్ని ఇప్పటికైనా ఆపాలని ఆయన కోరారు. అన్ని పార్టీలతో పాటు అధికారులతో ఒక కమిటీ వేసి ఖాళీలు పారదర్శకంగా భర్తీ చేయాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఆటలు కట్టిపెట్టి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అలాగే నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, సోలంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News