అత్యధికంగా ఓట్లు సాధించిన డా. ప్రతిభాలక్ష్మి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో హెచ్‌ఆర్‌డీఏ ఘన విజయం సాధించింది. హెచ్‌ఆర్‌డీఏ అధ్యక్షుడు డాక్టర్ మహేష్‌కుమార్ నేతృత్వంలో బరిలో నిలిచిన ప్యానెల్ అన్ని స్థానాల్లో గెలుపొందింది. ఇప్పటి వరకు మెడికల్ కౌన్సిల్‌లో పలుమార్లు గెలిచిన సీనియర్లు, హేమాహేమీ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు యువ డాక్టర్ల చేతిలో దారుణ ఓటమి చవిచూశారు. ప్యానెల్‌లోని సభ్యులంతా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అత్యధికంగా డాక్టర్ ప్రతిభా లక్ష్మి 7007 ఓట్లను సాధించగా, డాక్టర్ మహేశ్ కుమార్ 6735 ఓట్లు సాధించారు. ఈ భారీ విజయంతో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ పదవిని కూడా హెచ్‌ఆర్డీఏ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
మెడికల్ కౌన్సిల్‌లో 25 స్థానాలు ఉండగా ఇందులో 12 స్థానాలకు సభ్యులను ప్రభుత్వమే నామినేట్ చేస్తుండగా, మిగిలిన 13 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ స్థానాలను హెచ్‌ఆర్డీఏ పానెల్ నుంచి పోటీ చేసిన వైద్యులే గెలుపొందారు. కౌన్సిల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లెక్కల ప్రకారం ఈ ఎన్నికల్లో 17,090 ఓట్లు పోల్ కాగా వీటిలో 3311 ఓట్లను రిటర్నింగ్ ఆఫీసర్ వివిధ కారణాలతో తిరస్కరించగా, 13,779 ఓట్లను లెక్కించారు. ఇక ఎన్నికల ప్రాసెస్ అంతా బ్యాలెట్ పేపర్ విధానంలో జరిగింది. ఒక్కో బ్యాలెట్‌లో 96 మంది అభ్యర్ధులు పేర్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో బ్యాలెట్‌లో ఓటరు 13 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది. వీటన్నింటిని ఒక ఓటుగా పరిగణిస్తారు.