కాంగ్రెస్ శ్వేత పత్రానికి కౌంటర్‌గా బిఆర్‌ఎస్ ‘స్వేదపత్రం’
కెటిఆర్ ఎమోషనల్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిన వేళ, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ‘స్వేదపత్రా’న్ని విడుదల చేయనుంది. తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం, దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పేరిట ‘స్వేదపత్రా’న్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని హెచ్చరించారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించమని, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్ధితుల్లో ఊరుకోమని ఆయన పేర్కొన్నారు. అందుకే గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖచిత్రాన్ని వివరిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు ‘స్వేదపత్రం’ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామని కెటిఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. పల్లె ప్రగతి నుంచి మొదలు టిఎస్ ఐపాస్ వరకు ప్రతి పథకం.. అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలలను అందించిం దన్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు రూపురేఖలు మారిపోయా యన్నారు. అనేక సంక్షేమ పథకాలతో పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ఎంతో ప్రయోజనం జరిగిందని, ఇంత గొప్పగా ప్రజా పాలన సాగించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై వివరణ ఇచ్చేందుకు బిఆర్‌ఎస్ సిద్ధమైనట్లు తెలిపారు. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు ‘స్వేదపత్రం’ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయంపగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..
అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే…
— KTR (@KTRBRS) December 22, 2023