Saturday, December 21, 2024

రైతు హిత ప్రధాని చరణ్‌సింగ్

- Advertisement -
- Advertisement -

వ్యవసాయంలో మార్పులకు అనుగుణంగా అవసరమైన పథకాల రూపకల్పన చేయాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, గ్రామీణ శ్రేయస్సుకు గణనీయమైన సహకారి వ్యవసాయం. రైతులు సమాజానికి చేసిన కృషికి రైతులందరినీ గౌరవించడం, అభినందించడం కోసం ప్రత్యేకంగా వ్యవసాయదారుల దినోత్సవం ఉండాలనే లక్ష్యంతో భారత ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మ దినోత్సవం డిసెంబర్ 23 ఎంచుకున్నారు. ఆయన చేసిన కృషి వల్ల జమీందారీ చట్టం రద్దయింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ రోజును జాతీయ రైతుల దినోత్సవం, రాష్ట్రీయ కిసాన్ దివస్ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్‌తో సహా భారత దేశంలోని వ్యవసాయ, వ్యవసాయ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా రైతుల దినోత్సవాన్ని జరుపుకొంటారు.

ఇది డిసెంబర్ మొదటి శుక్రవారం నాడు ఘనా, అమెరికా లో జరుపుకొంటారు, జాంబియాలో ఆగస్టు మొదటి సోమవారం నాడు జరుపుకొంటారు.పాకిస్తాన్‌లో 2019 నుండి డిసెంబర్ 18న ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించింది. భారత దేశం గ్రామాలు, వ్యవసాయ మిగులు దేశంగా ప్రసిద్ధి చెందింది. అలాగే, దాదాపు 60% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. 2001లో ప్రభుత్వం చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి చేసిన కృషికి ఆయన జయంతిని కిసాన్ దివస్‌గా జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటి నుంచి డిసెంబర్ 23ని జాతీయ రైతు దినోత్సవంగా పాటిస్తున్నారు. రైతుల పాత్ర, ఆర్థిక వ్యవస్థకు వారి సహకారంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశ వ్యాప్తంగా అవగాహన ప్రచారాలు, డ్రైవ్‌లను నిర్వహించడం ద్వారా ఇది సాధారణంగా జరుపుకొంటారు.

చౌదరి చరణ్ సింగ్ 1902లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని నూర్పూర్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన 28 జులై 1979 నుండి 14 జనవరి 1980 వరకు భారత దేశ ఐదవ ప్రధాన మంత్రిగా పని చేశారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆయన గ్రామీణ, వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. భారత దేశం ప్రణాళికాబద్ధ వ్యవసాయానికి కేంద్రంగా వుంచేందుకు ఆయన నిరంతర కృషి చేశారు. రుణ విముక్తి బిల్లు 1939 సూత్రీకరణ అమలు ఆయన నాయకత్వంలో జరిగింది. వడ్డీ వ్యాపారుల నుంచి రైతాంగానికి ఉపశమనం కలిగించడమే ఈ బిల్లు లక్ష్యం. ఆయన ఉత్తరప్రదేశ్‌లో భూసంస్కరణల ప్రధాన రూపశిల్పి, రాష్ట్రమంతా ఏకరీతిగా వుండేలా భూ కమతాలపై సీలింగ్‌ను తగ్గించే లక్ష్యంతో 1960 భూ హోల్డింగ్ చట్టం తీసుకురావడంలో ముఖ్యమంత్రిగా కీలకపాత్ర పోషించారు. 1952లో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేస్తున్నప్పుడు జమీందారీ వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నాలకు ఆయన నాయకత్వం వహించారు.

చౌదరి చరణ్ సింగ్ 23 డిసెంబర్ 1978న రాజకీయేతర, లాభాపేక్ష లేని సంస్థ అయిన కిసాన్ ట్రస్ట్‌ను స్థాపించారు. అన్యాయానికి వ్యతిరేకంగా భారత దేశంలోని గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం, వారిలో సంఘీభావాన్ని పెంపొందించడం ట్రస్ట్ లక్ష్యం. ఆయన సాదాసీదా జీవనాన్ని విశ్వసించేవారు. ఆయన తన ఖాళీ సమయాన్ని ఎక్కువగా చదవడానికి, రాయడానికి వినియోగించారు. సింగ్ తన జీవిత కాలంలో అనేక పుస్తకాలు, బుక్ లెట్లను ప్రచురించారు. అతని ప్రసిద్ధ రచనలు కో- ఆపరేటివ్ ఫార్మింగ్ ఎక్స్-రేడ్, ఇండియాస్ పావర్టీ అండ్ ఇట్స్ సొల్యూషన్ అండ్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ. చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌కు వివిధ హోదాల్లో సేవలందించారు. పరిపాలనలో అసమర్థత, బంధుప్రీతి, అవినీతిని సహించని కఠినమైన కార్యనిర్వాహకుడిగా ఖ్యాతిని పొందారు. ఒక ప్రతిభావంతుడైన పార్లమెంటేరియన్, వ్యావహారిక సత్తావాది, చరణ్ సింగ్ వాక్చాతుర్యం, ధైర్యానికి ప్రసిద్ధి చెందారు.

అంకితభావంతో కూడిన ప్రజా కార్యకర్త, సామాజిక న్యాయంపై దృఢ విశ్వాసం వున్న చరణ్ సింగ్ బలం లక్షలాది మంది రైతుల మధ్య వున్న విశ్వాసం నుండి ఉద్భవించింది.చౌదరి చరణ్ సింగ్ చేసిన పలు ఉద్యమాల ఫలితంగా జమీందారీ చట్టం రద్దయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టారు. రైతులు, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతుబంధుగా గుర్తింపు తెచ్చుకున్నారు. చరణ్ సింగ్ రైతు నాయకుడిగానే 1987 మే 29న కన్నుమూశారు. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఒక రోజు వర్షాల కోసం, ఇంకోరోజు విత్తనాల కోసం, మరో రోజు ఎరువుల కోసం, బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. ఓ వైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే వున్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి. ఒకవేళ ప్రకృతి కరుణించి దిగుబడి బాగున్నా పండిన పంటకు సరైన ధర లేక నిస్సాహయుడిగా మిగిలిపోయే పరిస్థితి.

దేశాన్ని రక్షించే జవాన్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో అన్నం పెట్టే రైతన్నకు అంతే ప్రాముఖ్యత వుంది. అందుకే జై జవాన్… జై కిసాన్ అనే నినాదం యావత్ భారత దేశంలో వినిపిస్తున్నది.దేశానికి రైతు వెన్నెముక. రైతు లేనిదే ఈ రోజు మనిషి లేడు.. అన్నదాత అహర్నిశలు కష్టించి చెమటోడ్చితే తప్ప దేశానికి అన్నం ఉండదు. ఈ రోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలువే. కాలంతో జూదమాడి తన కడుపు మాడినా దేశానికి అన్నం పెట్టే రైతు బతుకుల్లో మార్పురావాలి. వ్యవసాయంలో హరిత విప్లవం ఫలితంగా ఉత్పత్తి పెరిగినా ఉత్పత్తిలో రసాయన వినియోగం పెరిగింది. ఉత్పత్తిలో నాణ్యత కొరవడుతోంది. ప్రపంచ వ్యవసాయ రంగంలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా అవసరమైన పథకాల రూపకల్పన చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News