Tuesday, November 26, 2024

ఆంధ్ర ప్రదేశ్, బిహార్ మాదిరిగా … తెలంగాణలో జనగణనలో కులగణన చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

బిసి సంఘాల డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులాల వారి లెక్కలు తీయాలని 13 బిసి సంఘాలు డిమాండ్ చేశాయి. వచ్చే జనవరి – ఫిబ్రవరి నెలలో సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు జరుగుతున్నందున సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి స్థానాలు నిర్ధారించడానికి కులాల వారి లెక్కలు అవసరమని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్‌లు 22 శాతం నుంచి 42 శాతానికి పెంచడానికి కూడా కులాల వారి లెక్కలు అవసరమని అన్నారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా కులాల వారి లెక్కలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పు చెప్పాయని గుర్తు చేశారు.

విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్‌లు 25 శాతం నుంచి 50 శాతానికి పెంచడానికి కూడా కులాల వారి లెక్కలు అవసరమన్నారు. కులగణన వల్ల సమాజ విభజన జరుగుతుందని కేంద్రమంత్రి గడ్కరీ మహారాష్ట్రలో ప్రకటించడాని కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. చదివేటప్పుడు, ఉద్యోగాల ఇస్తున్నప్ఫుడు, పెళ్ళి చేసినప్పుడు ప్రతి సందర్భంలోనూ మన దేశంలో కులాన్ని చూస్తారని, అప్పుడు లేని విభజన కులాల వారి లెక్కలు తీసేటప్పుడు జరుగుతుందని అనడం సరికాదని ఆయనన్నారు. ఆ పార్టీలలో కొన్ని స్వార్ధశక్తులు తమ స్వప్రయోజనాల కోసం పార్టీని వాడుకుని భ్రష్ట పట్టిస్తున్నాయని విమర్శించారు. కుల గణన- కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమని, రాజ్యాంగం కల్పించిన సదుపాయాలను కల్పించడానికి అవసరమని అన్నారు. కుల గణనతో ఒక్కో కులం జనాభాతో పాటు సాంఘీక, ఆర్ధిక, రాజకీయ వివరాలు సేకరిస్తే వారి కులాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్‌లు లబిస్తాయన్నారు. జనాభా ప్రకారం కులాల కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయించి వారి ఆర్ధికాభివృద్ధి కి చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. బిసి కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి గ్రూపులుగా వర్గీకరించడానికి కులాల వారి జనాభా లెక్కలు ఉపయోజపడుతాయన్నారు. ఈ సమావేశానికి జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News