Monday, December 23, 2024

కలవరపెడుతున్న కరోనా వైరస్

- Advertisement -
- Advertisement -

24 గంటల వ్యవధిలో 12 పాజిటివ్ కేసులు నమోదు

నెలాఖరులోగా రోజుకు 4 వేల ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయాలి
– మంత్రి దామోదర రాజనర్సింహ

మనతెలంగాణ/హైదరాబాద్ : చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,322 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 9, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కటి చొప్పున నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకోగా.. మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

సా.4 గంటల లోపే కొవిడ్ హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి : మంత్రి
డిసెంబర్ నెలాఖరులోగా రోజుకు 4 వేల ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. తెలంగాణాలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ అధికారులతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల లభ్యత, సరైన తీరులో వాటి వినియోగంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 34 ల్యాబుల్లో ఒక్కరోజులో 16,500 ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉందని.. మరో 84 ప్రైవేటు ల్యాబుల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయగలిగే సామర్థం ఉన్నదని అధికారులు మంత్రికి వివరించారు.

టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ద్వారా ఆర్‌టిపిసిఆర్ కిట్స్, విటిఎంలను కొనుగోలు చేయాలని, కరోనా వార్డులలో అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని మంత్రి ఈ సమీక్షలో అధికారులను ఆదేశించారు. గత రెండు వారాలుగా వివిధ ఆసుపత్రుల ద్వారా ఏర్పాటు చేసిన వార్డులలో 6,344 శాంపిల్స్‌లను సేకరించామని అధికారులు మంత్రికి వెల్లడించారు. సేకరించిన చేసుకున్న నమూనాల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల లోపే కొవిడ్ హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. వివిధ ఆస్పత్రిలో ఉన్న వెంటిలేటర్ల పనితీరును పరిశీలించాలని మంత్రి తెలిపారు. కరోనా బాధితుల చికిత్సకు అవసరమయ్యే ఆక్సిజన్ కన్సన్ట్రేటర్లలను తక్షణమే ఉపయోగంలోకి తేవాలని దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. వాడుకలో లేని వివిధ ఆస్పత్రిలో ఉన్న పిఎస్‌ఎ ప్లాంట్లను త్వరితగతిన పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్‌వి కన్నన్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివిధ శాఖల విభాగాధిపతులు, గాంధీ, ఉస్మానియా, చెస్ట్ హాస్పిటల్, నిలోఫర్, ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్‌లు, సిడిఎఫ్‌డి లాబ్‌ల ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.
పిల్లలు, వృద్ధులు మాస్క్‌లు ధరించాలి
రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మాస్క్‌లు ధరించాలని వైద్యారోగ్య శాఖ తెలిపింది. వివిధ ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు అందరూ కనీసం 6 మీటర్ల భౌతికదూరం పాటించడం చాలా ముఖ్యమని పేర్కొంది. అనవసర ప్రయాణాలు చేయవద్దని, ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే మాస్క్ ధరించి, హ్యాండ్ వాష్‌తో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్ వాడాలని, అలాగే ప్రయాణాలలో భౌతికదూరం పాటించాలని తెలిపింది.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి
జ్వరం, జలుబు, ముక్కుకారడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, గొంతు నొప్పి, నీరసం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలో ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News