Saturday, December 21, 2024

తమిళ మంత్రికి శిక్ష

- Advertisement -
- Advertisement -

అధికార పదవుల్లోని వారి అక్రమార్జన ఇంత అని తేల్చి శిక్షలు విధించడం అరుదు. అందుచేతనే అందిన కాడికి జేబులో వేసుకొని తరతరాలకూ తరగని సిరులను చేసుకొని ఆకాశ విహారం చేసే వారు దేశంలో అసంఖ్యాకంగా కనిపిస్తారు. పదవులు చేపట్టడానికి ముందున్న వారి ఆస్తులకు, దిగిపోయిన తర్వాత గల వాటికి మధ్య తేడా కొట్టవచ్చినట్టు తెలుస్తుంటుంది. కాని ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో శిక్షలు, భారీ జరిమానాలు పడిన మంత్రులు, ముఖ్యమంత్రులు అంతగా కనిపించరు. తమిళనాడు ఉన్నత విద్యామంత్రి కె పొన్ముడికి, ఆయన భార్య విశాలాక్షికి 2011 నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మద్రాసు హైకోర్టు మూడేళ్ళ జైలు, చెరి రూ. 50 లక్షల జరిమానా విధించడం విశేషం. ఇప్పటికే సెంతిల్ బాలాజీ అనే మరో డిఎంకె మాజీ మంత్రి మనీలాండరింగ్ కేసులో జైలు అనుభవిస్తున్నారు. పొన్ముడిపై ఈ కేసు గతంలో అప్పటి డిఎంకె ముఖ్యమంత్రి కరుణానిధి మంత్రివర్గంలో ఆయన వున్నప్పుడు దాఖలైంది. 2016లో ట్రయల్ కోర్టు పొన్ముడి దంపతులను నిర్దోషులుగా ప్రకటించగా అప్పీలు కేసులో హైకోర్టు, కింది కోర్టు తీర్పును కొట్టి వేసి ఈ శిక్షలు విధించింది.

పొన్ముడి వయసు 72. ఆయన భార్య 68వ ఏట వున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యాలను దృష్టిలో వుంచుకొని న్యాయమూర్తి జయచంద్రన్ శిక్షలు తక్షణం అమల్లోకి రాకుండా నెల రోజుల గడువు ఇచ్చారు. అందుచేత శిక్షను కోర్టు ప్రకటించిన వెంటనే మంత్రికి, ఆయన భార్యకు జైలు అమల్లోకి రాలేదు. సుప్రీం కోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందని డిఎంకె వర్గాలు ఆశతో వున్నాయి. ఈ శిక్ష ప్రభావంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద శాసన సభ్యత్వం, మంత్రి పదవి రెండూ ఊడిపోయాయి. అవినీతి కేసులో శిక్షల నుంచి సుప్రీం కోర్టు సాధారణంగా ఊరట కల్పించబోదని భావిస్తున్నారు. రూ. కోటి 72 లక్షల ఆస్తులను అదనంగా కలిగి వున్నారని రుజువు కావడంతో పొన్ముడి దంపతులకు ఈ శిక్షలు పడ్డాయి. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లేకపోడం మన రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తున్న లోపం. దీనితో పదవుల్లోని వారి అవినీతికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నది. 2021 ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్ అవినీతి సూచీలో మొత్తం 180 దేశాల్లో భారత దేశం 86వ ర్యాంకులో వున్నది. ఆసియాలోకెల్లా ఇండియాలోనే అత్యధిక లంచగొండితనం వున్నదని జిసిబి సంస్థ నిగ్గు తేల్చింది.

ప్రభుత్వ సర్వీసులను వినియోగించుకోడానికి వ్యక్తిగత పలుకుబడిని ప్రయోగించడం కూడా మన దేశంలో అత్యధికంగా వున్నట్టు రుజువైంది. ఐశ్వర్యవంతులు కావడానికి రాజకీయమే రాచమార్గమని భావిస్తున్నారు. ఈ జాడ్యం వదలాలంటే ఇటువంటి తీర్పులు అవసరం ఎంతైనా వుంది. ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించడానికి అవసరమైన నియమ నిబంధనలు రూపొందించలేదు. ఒకవేళ అటువంటి నియమాలున్నా వాటిని ఉల్లంఘించడానికి పదవుల్లోని వారు వెనుకాడడం లేదు. ఉదాహరణకు ప్రభుత్వ పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు కేటాయించేటప్పుడు విధిగా పాటించవలసిన పోటీ వేలం పద్ధతిని ఆచరణలో పక్కనపెట్టి తాము కోరిన వారికి నేరుగా అప్పగిస్తున్నారు. ఇందులో జరిగే అవినీతి అసాధారణమైనది. ప్రభుత్వంలో పనులు చేయించడానికి శాసన సభ్యులు, ఎంపిలు వ్యక్తిగత ప్రతిఫలాన్ని ఆశించడం ఆనవాయితీ అయిపోయింది. పేదల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ వ్యయంలో అత్యధిక శాతం అవినీతిపరుల కైంకర్యం అవుతున్నది. ఈ విషయం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎప్పుడో చెప్పారు. రూపాయిలో 14 పైసల కిమ్మత్తు మాత్రమే పేదలకు చేరుతున్నదని ఆయన అన్నారు.

ఆ పరిస్థితిలో కొంచెమైనా మార్పు రాలేదు. ఈ దారుణ రాజకీయ అవినీతికి మూలాలు ఎన్నికల్లో కూడా వున్నాయి. ప్రశాంతంగా ప్రజలు స్వచ్ఛందంగా జరుపుకోవలసిన ప్రజాస్వామ్య సంబరం ఆకాశం ఎత్తు నోట్ల కట్టల వ్యాపారంగా మారిపోయింది. పర్యవసానంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన దేశలంలో భ్రష్టుపట్టి పోయింది. ప్రతి ప్రభుత్వ ప్రాజెక్టు అమలులోనూ ముడుపులు ముమ్మరించాయి. ఈ దుస్థితిని తొలగించాలంటే విప్లవ స్థాయిలో ప్రజా చైతన్యం వెల్లువెత్తాలి. అంత వరకు రాజకీయ అవినీతిపరుల్లో దొరికిన వారే దొంగలు, దొరకని వారు దొరలుగా చలామణి అవుతారు. పొన్ముడి దంపతులకు తీవ్ర శిక్షలు పడడం డిఎంకెకు అప్రతిష్ఠను కలిగిస్తుంది. మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి ఇంతటి అవినీతి కేసులో జైలుకు వెళ్లక తప్పని స్థితి తలెత్తడం ఆ పార్టీ రాజకీయ భవితవ్యాన్ని బలి తీసుకొంటుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వానికి, మంత్రివర్గ కూర్పుకి మచ్చ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News