Monday, December 23, 2024

రైతుబీమా వచ్చిన వారిలో 99.9 శాతం సహజ మరణాలే: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా బిఆర్‌ఎస్ పాలనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక.. అబద్ధాల పుట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. అదొక అంకెల గారడీ, అభాండాల చిట్టా అని విమర్శించారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీ వేదికగా తాను, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలు ధీటుగా సమాధానం చెప్పామని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో గత తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ తెలంగాణ భవన్‌లో ఆదివారం ‘స్వేదపత్రం’ పేరిట కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో తమపై బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు.
తెలంగాణలో ఒక్క ఫ్లోరైడ్ ప్రాంతం కూడా లేదని కేంద్రమే చెప్పిందని కెటిఆర్ గుర్తు చేశారు. అందుకు పెట్టిన ఖర్చు నిరర్ధకం అంటారా..? అని ప్రశ్నించారు. రైతుల సహజ మరణాలకు కూడా రైతు బీమా వస్తుందని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో 1,11,320 కుటుంబాలకు రైతు బీమా సొమ్ము అందిందని.. 1,11,320 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సిఎం అంటున్నారని వాపోయారు. రైతుబీమా వచ్చిన వారిలో 99.9 శాతం సహజమరణాలే అని పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని… ఇదీ వాళ్ల పరిజ్ఞానం.. తెలివితేటలు అని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కెటిఆర్ పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్ హయాంలో పేదరికం బాగా తగ్గింది
తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో పేదరికం బాగా తగ్గిందని కెటిఆర్ చెప్పారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) గణాంకాల ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 21.92 శాతం పేదరికం ఉండగా, తాము దిగిపోయే నాటికి కేవలం 5.8 శాతానికి చేరిందని తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలో ఇంత వేగంగా పేదరికం తగ్గలేదని అన్నారు. ఇలా అన్ని విషయాల్లో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనకు బృందాలను పంపాయని, వాళ్ల రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News