Monday, December 23, 2024

ఆర్‌టిసి బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి

- Advertisement -
- Advertisement -

గజ్వేల్‌ః- చౌరస్తా వద్ద ఆర్‌టిసి బస్సు ఎందుకు ఆపలేదంటూ డ్రైవర్‌పై దాడి జరిగిన ఘటన సిద్దిపేట జిల్లా, తొగుట మండలం, వెంకట్రావుపేటలో చోటుచేసుకుంది.గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో మేనేజర్ సురేఖ తెలిపిన వివరాల ప్రకారం… సికిందరాబాద్ నుంచి గజ్వేల్ మీదుగా దుబ్బాక వెళ్లే పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తున్న గజ్వేల్ మండలం, అహ్మదీపూర్‌కు చెందిన ఓ మహిళ అహ్మదీపూర్ చౌరస్తా వద్ద దిగాల్సి ఉంది. అయితే ఇయర్ ఫోన్‌లో మాట్లాడుతూ టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్న ఆ మహిళ దిగాల్సిన అహ్మదీపూర్ చౌరస్తా దాటి బస్సు వెళ్లింది. అనుమానంతో టికెట్ ఏదని ఆ మహిళను కండక్టర్ ప్రశ్నించగా ఫోన్ సంభాషణను ఆపి బస్సు ఆపాల్సిందిగా బస్సు డ్రైవర్, కండక్టర్‌ను కోరింది. చీకటి పడడంతో మార్గ మధ్యలో ఎందుకని, కొల్గూరు గ్రామంలో దిగాలని డ్రైవర్, కండక్టర్ సూచించారు.

కొల్గూరు గ్రామంలో బస్సు దిగిన ఆ మహిళ అహ్మదీపూర్ చౌరస్తా వద్ద బస్సు ఎందుకు ఆపలేదంటూ అరిచి డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి ఇద్దరినీ చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.బస్సు దుబ్బాక వెళుతున్న క్రమంలో తొగుట మండలం, వెంకట్రావుపేట వద్దకు చేరుకొని ప్రయాణికులను దింపుతుండగా ఆ మహిళకు సంబంధించిన కొందరు వ్యక్తులు ఆటోలో వచ్చి డ్యూటీలో ఉన్న బస్సు డ్రైవర్ స్వామి, కండక్టర్ రజితపై దాడి చేశారు. బస్సు డ్రైవర్, కండక్టర్‌తో వారు గొడవ పడుతున్న క్రమంలో వెంకట్రావుపేట గ్రామస్థులు కలుగచేసుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు. కాగా, డ్రైవర్ స్వామి, కండక్టర్ రజిత తమపై జరిగిన దాడి విషయమై తొగుట పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారని డిపో మేనేజర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News