చెన్నై : ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడేవారు తమిళనాడులో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారని డిఎంకె పార్లమెంట్ సభ్యులు దయానిధి మారన్ వ్యాఖ్యానించారు. ఈ ఎంపి మాటలు తీవ్రస్థాయి వివాదానికి దారితీశాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే హిందీవారు తమిళనాడుకు వచ్చి ఇక్కడ నిర్మాణ పనులు చేస్తుంటారు. లేకపోతే టాయ్‌లెట్లు కడుగుతారు అని ఆయన చేసిన వ్యాఖ్యలను బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సామాజిక మాధ్యమంలో పెట్టారు. హిందీ మాట్లాడే ప్రజలంటే ఈ డిఎంకె ఎంపికి ఇంత చులకనా? అని బిజెపి నేత ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల వారిని కించపరుస్తూ ఈ డిఎంకె ఎంపి దిగజారి మాట్లాడితే ఆయా రాష్ట్రాలకు చెందిన ఇండియా కూటమి పార్టీల నేతలు ఏం చేస్తున్నారు? ఏ ఒక్కరూ పెదవి విప్పడం లేదని, ఈవిధంగా వీరికి ఆయా రాష్ట్రాల ప్రజల పట్ల ఎంతటి అభిమానం ఉందనేది తెలుస్తోందని చెప్పారు. డిఎంకె ఎంపి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
ఇంగ్లీషు నేర్చుకుని, విద్యావంతులు అయిన వారు ఐటి కంపెనీలలో పనిచేస్తున్నారు. కేవలం హిందీ ఒక్కటే తెలిసిన వారు దిక్కుమాలిన ఉద్యోగాలు చేస్తున్నారని దయానిధి తెలిపారు. దీనిపై పాట్నాకు చెందిన బిజెపి ఎంపి రవి శంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. బీహారీలను చులకనే చేసే చవకబారు పద్ధతులు వీడితే మంచిదని మారన్‌పై మండిపడ్డారు. ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామ్యం అయిన నితీశ్‌కుమార్ పార్టీ ఏలుబడిలో ఉన్న బీహార్‌లో దుస్థితి వల్లనే బీహారీలు గత్యంతరం లేకనే ఇతర రాష్ట్రాలలో కూలీపనులకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఇండియా కూటమి ఎప్పటికప్పుడు దేశ ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల ప్రాతిపదికన విడదీస్తూ అడ్డగోలుగా మాట్లాడుతోందని బిజెపి ప్రతినిధి షెహజాద్ విమర్శించారు. వీరు మరోసారి విభజించు పాలించు పంథాకు దిగారని వ్యాఖ్యానించారు. ఎంపి అయి ఉండి దయానిధి మారన్ వాడుతున్న భాష అనుచితంగా ఉందన్నారు. దయానిధి మారన్ వైఖరి ఈ విధంగా ఉంటే , ఇండియా కూటమి నేతల తీరు మరీదారుణంగా ఉంటోంది.
ఓ ప్రాంతం వారిని మారన్ కించపరుస్తూ ఉంటే నితీశ్ కుమార్ లాలూ , తేజస్వీ, కాంగ్రెస్ నేతలు, అఖిలేష్ యాదవ్ నిమ్మకునీరెత్తినట్లుగా ఉన్నారని , దీని సంకేతాలు ఎటుపోతాయని ప్రశ్నించారు. కాగా బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్ దయానిధి వ్యాఖ్యలను ఖండించారు. దీనిని తాము సహించేది లేదన్నారు. ఈ మాటలకు దిగిన వారు ఏ పార్టీకి చెందిన వారనేది చూడటం లేదని , ఎవరైనా ఇటువంటి చులకన మాటలకు దిగరాదని వ్యాఖ్యానించారు. ఈ దేశం అంతా ఒక్కటే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని స్థానికులు గౌరవించడం మర్యాదస్తుల లక్షణం అని తిప్పికొట్టారు. దయానిధి మారన్ వ్యాఖ్యలపై డిఎంకె స్పందించింది. బిజెపి వెలువరించిన వీడియో చాలా పాతది. బిజెపి దురుద్ధేశపూరితంగానే ఈ విషయాన్ని ప్రచారం చేస్తోందని డిఎంకె వివరణ ఇచ్చుకుంది. ప్రతిపక్ష కూటమి ఇండియాలో హిందీ హిందేతర ప్రాంతాల నడుమ భాషా వివాదం, స్థానికేతరుల ఉనికి వంటి విషయాలు ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల దశలో సీట్ల సర్దుబాట్ల విషయం ఇండియాకు కొరకరాని కొయ్య అవుతుందనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.