కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ అన్నదాతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రైతులను అవమానించేవిధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. శివానంద పాటిల్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. మరణించిన రైతు కుటుంబాలకు అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం పెంచాక, రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగాయని అన్నారు.
అంతటితో ఆయన ఆగలేదు. ‘ఇప్పడు రైతులు కోరుకునేది ఒక్కటే, ప్రతి ఏటా కరవు రావాలని. అలా కరవు వస్తే, తాము తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయనేది వారి ఆశ’ అని పాటిల్ వ్యాఖ్యానించారు. ‘రైతులకు నీళ్ళు ఉచితం. కరెంటు ఉచితం. విత్తనాలు, ఎరువులు ఉచితం. కాబట్టి తమ రుణాలు రద్దు కావాలంటే ప్రతి ఏటా కరవు రావాలని రైతులు కోరుకుంటున్నార’ని ఆయన అన్నారు. కాగా సిద్దరామయ్య ప్రభుత్వం రైతులను అవమానించేవిధంగా వ్యవహరిస్తోందని బిజేపీ ధ్వజమెత్తింది. సిద్దరామయ్య మంత్రివర్గంలో మూర్ఖులే ఎక్కువమంది ఉన్నారంటూ వ్యాఖ్యానించింది.