న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య 4170 కి చేరింది. కొత్త వేరియంట్ జెఎన్.1 కారణంగానే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉండగా కర్ణాటకలో కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో మంగళవారం ముగ్గురు మరణించడంతో మరణాల సంఖ్య 5,33, 337కు చేరింది. బెంగళూరులో ఇద్దరు, రామనగర జిల్లాలో ఒకరు వైరస్ బారిన పడి చనిపోయారు.కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 (జెఎన్.1) కేసులు మరో ఆరు కొత్తగా నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 69 కి చేరిందని మంగళవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ వేరియంట్ బాధితులు చాలామంది ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని. ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య పెరగలేదని వివరించాయి. దేశంలో తాజాగా కరోనా కేసులు 412వరకు బయటపడగా, క్రియాశీల కేసులు 4170కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగగళవారం వెల్లడించింది.
ప్రస్తుతం దేశం మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య 4,50,09,660 కు చేరగా, కోలుకున్న వారి సంఖ్య 4,44,72, 153 వరకు ఉంది. రికవరీ రేటు 98.81 శాతం ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇంతవరకు 220. 67 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. గత కొత్త వేరియంట్‌పై గతవారం చాలా లోతుగా అధ్యయనం చేయడమైందని, ఈమేరకు పరీక్షలు ముమ్మరం చేయాలని, పరిశీలన ప్రక్రియలు మరింత బలోపేతం చేయాలని నీతి అయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నప్పటికీ, తక్షణం ఆందోళన చెందనక్కర లేదని, 92 శాతం మంది బాధితులు ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. రానున్న పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కొవిడ్ 19 నియంత్రణ చర్యలు చేపట్టేందుకు సమాయత్తం కావాలని , ఈ వ్యాధి వ్యాప్తి కాకుండా ప్రజారోగ్య ప్రమాణాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాంశు పంత్ గత వారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖల ద్వారా సూచించారు.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా ఇన్‌ఫ్లుయెంజా వంటి కేసులు, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు అన్ని ఆరోగ్యకేంద్రాల్లో పర్యవేక్షించాలని, కేసులు వేగంగా పెరుగుతుండడాన్ని మొదట్లోనే గుర్తించి ఆ సమాచారం తెలియజేయాలని రాష్ట్రాలకు సూచించారు.