Friday, November 22, 2024

ట్రాఫిక్ చలాన్‌లపై రాయితీ వచ్చేనెల 10వ తేదీ వరకు వర్తింపు

- Advertisement -
- Advertisement -

జీఓను జారీ చేసిన ప్రభుత్వం
ఈసారి కూడా భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలపై మరోసారి భారీ రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి జిఓ 659లో రోడ్డు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం ఇచ్చిన రాయితీ వల్ల పెండింగ్‌లో ఉన్న చలానాలు రూ.300 కోట్లు వరకు వసూలయ్యాయి. ఇదే తరహాలో మరోసారి భారీగా రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. దీంతోపాటు చాలామంది వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, రాంగ్ రూట్‌లో వెళ్లడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర నిబంధనలను పాటించడం లేదు. దీంతో ట్రాఫిక్ చలాన్లు అధికం అవుతున్నాయి. 2022లో పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను క్లియర్ చేసేందుకు రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు 70 శాతం రాయితీ ఇచ్చారు. ప్రస్తుతం గతంలో కంటే ఈసారి భారీగా రాయితీ ఇచ్చింది.

ఆర్టీసి బస్సులు, తోపుడు బండ్లకు 90 శాతం
ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాయితీలో భాగంగా ఆర్టీసి బస్సులు, తోపుడు బండ్లకు 90 శాతం, ద్విచక్ర వాహనాలపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలపై 60 శాతం, లారీలు, ఇతర భారీ వాహనాలపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ చలాన్‌లను ఆన్‌లైన్, మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మార్చి 31, 2022 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీని ప్రకటించింది. ద్విచక్ర వాహనాలకు 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ క్రమంలో దీనికి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 65 శాతం మంది చలానాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ యథాతథంగా పెండింగ్ భారం పెరిగిపోయింది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ 2 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మరోమారు రాయితీ ప్రకటించారు. ఈ చలానాను echallan.tspolice.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెహికల్ నంబర్ ఎంటర్ చేసి చెల్లించవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News