పెషావర్ : పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న జాతీయ అసెంబ్లీతోపాటు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓ హిందూ మహిళ పోటీకి దిగడం విశేషం. పాకిస్థాన్ కల్లోలిత ఖైబర్ పఖ్తుంఖ్వా లోని బునేర్ జిల్లా నుంచి హిందూ మహిళ డాక్టర్ సవీరా పర్కాశ్ పోటీ చేస్తున్నారు. పీకే 25 స్థానానికి ఆమె శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారని ఆమె తండ్రి ఓం పర్కాశ్ చెప్పారు. వృత్తిరీత్యా వైద్యురాలైన 25 ఏళ్ల పర్కాశ్ ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి 2022లో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఓం పర్కాశ్ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ )లో గత 35 ఏళ్లుగా సభ్యుడుగా ఉంటున్నారు. తండ్రి బాటలోనే రాజకీయాల్లో సవీరా పర్కాశ్ చేరారు. బునేర్‌లో పీపీపీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా ఆమె ఉంటున్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం తన తండ్రి ఏ విధంగా పనిచేస్తున్నారో అదే విధంగా తన తండ్రి అడుగుజాడల్లో మహిళల సంక్షేమం కోసం వారి హక్కుల సాధనకు పాటుపడడమే తన లక్షంగా సవీరా వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టరుగా పేద ప్రజలకు వైద్యం అందించడంలో ఉన్న అనుభవంతో శాసనసభ్యురాలిగా ఎన్నికై ప్రజలకు సేవ చేయాలన్నది తన చిరకాలస్వప్నంగా ఆమె వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఐదు శాతం మహిళా అభ్యర్థులు ఉండాలంటూ పాక్ ఎన్నికల కమిషన్ ఇటీవల కీలక సవరణలు చేసింది. ఈ నేపథ్యంలో బునేర్ జిల్లా లోని జనరల్ స్థానం నుంచి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) టికెట్‌పై సవీరా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో దాదాపు 3000 మంది మహిళలే. హిందూ సమాజానికి చెందిన ఏకైక మహిళ సవీరానే. ముస్లింలు అత్యధిక శాతం మంది ఉన్న బునేర్ నుంచి ఆమె పోటీ చేస్తుండడం ప్రాధాన్య ం సంతరించుకుంది.