బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో ఐదో గ్యారంటీ ‘యువనిధి’ రిజిస్ట్రేషన్‌ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ప్రారంభించారు. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి ఆర్థికంగా ఆసరా కోసం రూ.1500 నుంచి రూ.3000 వరకు భృతి కల్పించడమే ఈ యువనిధి గ్యారంటీ ఉద్దేశం. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 12న స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా ప్రారంభమౌతుంది. డిగ్రీ కానీ డిప్లొమా కానీ తీసుకున్న తరువాత 180రోజులు పూర్తయినా ఉద్యోగం రాని యువకులకు నెలనెలా ఈ మేరకు నగదు పంపిణీ చేస్తారు.
అభ్యర్థులు కనీసం గత ఆరేళ్ల నుంచి కర్ణాటకలో ఉన్న వారేనని నిరూపించుకోవలసి ఉంటుంది. రెండేళ్ల పాటు ఈ అనెంప్లాయ్‌మెంట్ అలవెన్సు అందిస్తారు. నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలోకే ఈ నగదు జమ అవుతుంది. ఈ పథకం కోసం ఈ ఏడాది రూ. 250 కోట్లు కేటాయించినట్టు స్కిల్ డెవలప్‌మెంట్ , ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ మంత్రి శరణప్రకాష్ పాటిల్ చెప్పారు. వచ్చే సంవత్సరం రూ. 1250 కోట్లు, ఆ తరువాతి సంవత్సరం రూ. 2500 కోట్లు ఈ పథకం కింద ఖర్చు చేస్తారు. అభ్యర్థులు సేవా సింధు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు.