Tuesday, November 5, 2024

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలి

- Advertisement -
- Advertisement -

సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ సభలో వక్తల వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ స్వాతంత్య్రం, సమైఖ్యత,సమగ్రత కోసం ఏ రాజకీయ పార్టీలు చేయని త్యాగాలు కమ్యూనిస్టు పార్టీ చేసిందని పలువురు వక్తలు కొనియడారు. మతోన్మాద, ఫాసిస్టు విధానాలతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీచేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతి రేకంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలోని మగ్ధూంభవన్ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 99వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సభలో డాక్టర్ కె.నారాయణ ప్రసంగిస్తూ దేశంలోని సంస్థాగత వ్యవస్థలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ప్రతి ఒక్కరి హక్కుల కోసం రాజకీయ పోరాటం చేయాలని, గ్రామీణ, పట్టణాల వరకు కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశం కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడిపోకుండా భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగాలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయ లేదని, అందుకు తాము స్వాతంత్య్ర ఉద్యమంలో, అనంతరం పంజాబ్, కశ్మీర్, ఈశాన్యరాష్ట్రాలలో అనేక మందిని నాయకులను కోల్పోవల్సి వచ్చిందన్నారు.

‘ఇండియా’ కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, వామపక్షాల భాగస్వామ్యం లేకుండా ‘కూటమి’ బలపడడం సాధ్యం కాదన్నారు. పార్లమెంట్ నాటకీయంగా పొగబాంబు కుట్ర చేసి అందరి దృష్టిని మళ్ళీంచారని, పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన నిరసనకు దిగిన ప్రతిపక్ష ఎంపిలను బయటకు పంపించి, కేంద్రంలోని బిజెపి కోరుకున్న బిల్లులను ఆమోదించుకున్నారని విమర్శించారు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ వివక్షత, అణివేత ఉన్న చోట కమ్యూనిస్టల గొంతు వినిపించాలని, వాటిని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ప్రసంగిస్తూ సృష్టి, గాలి, భూమి, నీరు , విశ్వం ఉన్నంత వరకు ఎర్రజెండా ఉంటుందన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని,రాజ్యంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని,మోడీ, అమిత్ అధికరాంలోనికి వచ్చిన తర్వాత నియంతృత్వం, మతోన్మాదం, ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కందిమళ్ల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా హక్కులతో పాటు అధికారం కోసం కూడా పోరా టం చేయాలన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో కలసి బలమైన ఉద్యమాన్ని నిర్మించాలన్నారు. ఎఐటియుసి సీనియర్ నాయకులు పి.ప్రేంపావని మాట్లాడుతూ మహిళా ఉద్యమాలకు మహిళా యోధులను అందించడంలో కమ్యూనిస్టు పార్టీ సఫలీకృతమైందన్నారు. కాగా సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి.నర్సింహ స్వాగతం పలుకగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్ వందన సమర్పణ చేశారు.
సీనియర్ నేతలకు సన్మానం
సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ సీనియర్ నాయకులను సన్మానించారు. సురవరం సుధాకర్ రెడ్డిని కూనంనేని సాంబశివ రావు, కందిమళ్ల ప్రతాప్ రెడ్డిని పల్లా వెంకట్ రెడ్డి ,ఏటుకూరి ప్రసాద్ డాక్టర్ కె. నారాయణ, ఏటుకూరి కృష్ణమూర్తిని చాడ వెంకట్ రెడ్డి శాలువాలు కప్పి సన్మానించారు.
సిపిఐకి విరాళాలు
సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.వి.విజయలక్ష్మిసోదరి, అమెరికాలో ఉంటున్న రాజ్యలక్ష్మిమనవరాలు రీమ, మనవడు రోషన్ రూ. 25వేల విరాళం చెక్కును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు అందజేశారు. అలాగే సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి, డాక్టర్ బి.వి.విజయలక్ష్మి దంపతులు మరో రూ.25వేల విరాళాన్ని అందజేశారు. ప్రముఖ సాహితీవేత్త ఏటుకూరి ప్రసాద్ రూ.10వేలను పార్టీ విరాళాన్ని కూనంనేని సాంబశివరావుకు అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News