Intuition is our deeper intelligence that is able to read the room or the marketplace, make decisions from a wiser resource, and extract data faster than the conscious mind can analyze’– Steve Jobs
‘Everyone has intuition, but what distinguishes intuitive people is that they listen to, rather than ignore, the guidance of their gut feelings’ Joanne S. Black
వ్యక్తుల గొప్పతనం వాళ్ల ఎత్తు, పొడవు, లావు, ఆకారాన్ని బట్టి వుండదు. వాళ్ల శీలం, అత్యంత క్లిష్ట సమయాల్లో వాళ్లు తీసుకునే వివేకవంతమైన నిర్ణయాలు (Smart Decisions), చేసే దృఢమైన కార్యాలు (Firm Actions), వాటిల్లో ప్రస్ఫుటమయ్యే వాళ్ల అంతర్ దృష్టి (Intuition) ని బట్టి ఉంటుంది. అది ఏ రంగమైనా, ఏ కాలమైనా, ఏ ప్రాంతమైనా మనుషుల విజయాల్లో వాళ్ల అంతర్ దృష్టిదే కీలకపాత్ర. అందుకే ఉదయం, సాయంత్రం ట్యూషన్ అంటూ ఉరుకులు పరుగులు పెట్టే స్కూలు పిల్లలతో నేను అంటుంటాను ‘ట్యూషన్‌లో ఇంట్యూషన్’ ఏమన్నా దొరుకుతుందా! అని. ఏ వ్యక్తికి ఆవ్యక్తి తీసుకునే నిర్ణయాలకు అంతర్ దృష్టికి అవినాభావ సంబంధం వుంటుందన్న విషయం ఇటీవలి కాలం దాకా పెద్దలకే తెలియదు.
పాపం, ఇంక పిల్లలకేం తెలుస్తుంది? ఆ మాటకొస్తే మహా ఘటికులు అనుకుంటున్న ఒకనాటి గ్రీకు తత్వవేత్తలకే అంతర్ దృష్టి బోధపడలేదంటే ఆశ్చర్యం కాదు.విశ్లేషణ, సామర్థ్యం లేకున్నా ఉద్దేశంలో బలం వుంటే విజయవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగు తారని ప్రాచీన తత్వవేత్తలు భావించారు. అంతర్ దృష్టి మానవ నాగరికత ప్రారంభ కాలం నుండి ఉనికిలో వుందని గుర్తించదగిన సాక్ష్యాలను కనుగొనడంలో ఇప్పుడిప్పుడే పరిశోధకులు సమస్యలను ఒక్కటొక్కటిగా అధిగమిస్తున్నారు. గట్ ఫీలింగ్, ఇన్స్టింక్ట్, సిక్త్ సెన్స్ అనే సంబోధనలతో అంతర్ దృష్టిని సైకాలజిస్టులు అధ్యయనం చేస్తున్నారు. హ్యుమన్ ఇంట్యూషన్‌ను గుర్తించడంలో ఉత్తర అమెరికాలోని స్థానిక జాతులు (First Nations) చాలా ముందంజలో వున్నట్టు తెలుస్తున్నది. ఇంతకూ ఇంట్యూషన్ చర్చ ఇప్పుడెందుకు? అంటే, అంతర్ దృష్టి ప్రసాదించాల్సింది చదువులే కనుక. పెంపొందించాల్సింది ఉపాధ్యాయులే కనుక. మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సైతం తన రచనల్లో అనేక సందర్భాల్లో అంతర్ దృష్టిని గురించి ప్రస్తావించారు. అంతర్ దృష్టి జ్ఞానానికి రూపం కాదు, సాధనం అంటూ వ్యక్తి ఎంత జ్ఞాన సంపన్నుడైనప్పటికీ అంతర్ దృష్టి కొరవడితే జీవితం ప్రమాదంలో పడతుందని ఉద్బోధించారు.
ప్రతి వ్యక్తి జీవితం అతడి లేదా ఆమె ఎడతెగని జ్ఞాన సంచితం ద్వారా కొలవబడుతుందని ఎపిస్టెమాలజీ చెబుతుంది. అయితే ఎప్పటికప్పుడు పరిస్థితుల పట్ల అవగాహన, ఉత్సుకత రెండూ వ్యక్తి స్థాయిలో నిత్యం జాగృదావస్థలో వుండాలి. అప్పుడే వాళ్లది వివేకవంతమైన మనస్సు (Sentient Mind) అవుతుంది. వివేకవంతమైన మనస్సులోనే జ్ఞానం ఆటుపోట్ల (Ebbings and Flowings) రూపం ధరిస్తుంది. వివేకవంతమైన మనస్సు సాధారణ కృత్యమే అంతర్ దృష్టి. అంతర్ దృష్టికి సంబంధించిన ఒక ఉదాహరణను మీతో పంచుకుంటాను. మీరు కుటుంబంతో ప్రధాన జాతీయ రహదారిపైన కారులో వెళ్తున్నారనుకుందాం. రద్దీ విపరీతంగా వుంది. అకస్మాత్తుగా మీ అంతర్ దృష్టి లేదా సిక్త్ సెన్స్ మిమ్నిల్ని తరువాత వచ్చే ఎక్జిట్‌లో కిందకి దిగి సర్విస్ రోడ్లో వెళ్లమని చెప్పింది. ఆ ప్రకారంగానే మీరు హైవే దిగి కిందుగా వెళ్తున్నారు. కొద్ది నిముషాల తర్వాత మీ కారుకు సమాంతరంగా హైవేలో ఓ భారీ ప్రమాదం జరిగింది. ఏడెనిమిది వాహనాలు అక్కడికి అక్కడే బూడిద అయినాయి. మీకెందుకో ఎక్జిట్ తీసుకుని కింద నుంచి వెళ్తే బాగుంటుందని పించింది. మీరది వెంటనే చేశారు. తర్వాత ఎక్జిట్‌లో దిగుదామనుకొని నిర్ణయాన్ని వాయిదా వేసి వుంటే మీరూ, కారూ, కుటుంబమూ ప్రమాదంలో దగ్ధమయ్యేటోళ్లు.
ఇప్పుడు అంతా క్షేమంగా వున్నారు. కారణం మీ గట్ ఫీలింగ్, ఇన్స్టింక్ట్, సిక్త్‌సెన్స్. ఇక్కడ మీరు ‘స్పృహతో కూడిన తార్కికం అవసరం లేని తక్షణ పరిస్థితి పై పట్టును కలిగి ఉండే సామర్ధ్యం’ ప్రదర్శించారు. దీన్నే అంతర్ దృష్టి అంటారు. ఇంకా స్పష్టత కావాలంటే ‘ఆలోచించే మనస్సుకు తదుపరి ఎక్కడ చూడాలో అంతర్ దృష్టి చెబుతుంది’ అంటున్న జోనాస్ సాల్క్, అమెరికన్ వైద్యపరిశోధకుడి వ్యాఖ్యను ప్రమాణంగా తీసుకోవాలి. వాస్తవాలు అందుబాటులో లేనప్పు డు, పరిస్థితి గందరగోళంగా వున్నప్పుడు, కష్టాల్లో కఠిన సమయాల్లో ఎవళ్ల అంతర్ దృష్టి వాళ్లకు దారి చూపుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అవాంఛనీయత అలజడి చొరబడినపుడు యువత కూడా పైనపేర్కొన్న చోదకుడి నిర్ణయం లాంటి నిర్ణయాలనే తీసుకుంటూ వుంటేనే సురక్షితంగా ఉంటారు.గ్లోబలైజేషన్ ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి శ్రేయోదాయినిగా ప్రచారమయ్యింది. ఇదే విషయాన్ని థామస్ ఫ్రైడ్ మాన్ తన ‘ది వరల్డ్ ఈజ్ ఫ్లాట్: ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ది ట్వంటీ- ఫస్ట్ సెంచరీ’ గ్రంథంలో సమర్థిస్తారు. కానీ అంచనాలు తారుమారై తీవ్ర రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక సంక్షోభాలు, అంతర్యుద్ధాలు, వ్యవస్థల దివాలాతో ప్రపంచీకరణ భవిష్యత్తు మునుపెన్నడూ లేనంత అనిశ్చితంగా కనిపిస్తుండటమూ మనం చూస్తున్నదే.
దీన్నే ‘ది గ్లోబలైజేషన్ మిత్: వై రీజియన్స్ మేటర్’ అనే గ్రంథంలో షానన్ కె.ఒ నీల్ విశదీకరిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక ఏకీకరణ ప్రపంచ స్థాయిలో కంటే రీజనల్ గానే చాలా విజయవంతమైందని, విధాన నిర్ణేతలు సరళీకణల ప్రాంతీయ స్థాయిని, పర్యవసానాలను గమనంలో వుంచుకుని భవిష్యత్ వాణిజ్యం పారిశ్రామిక విధానాలను రూపొందించడం అవసరమని నీల్ చెబుతున్నారు. అంతర్ దృష్టిని వింగడిస్తూ ఐన్‌స్టీన్ మహానుభావుడు ‘నేను అంతర్ దృష్టిని, ప్రేరణను నమ్ముతాను.
జ్ఞానం కంటే ఊహ చాలా ముఖ్యం. జ్ఞానం పరిమితంగా వుంటుంది, అయితే ఊహ మొత్తం ప్రపంచాన్ని ఆలింగనం చేస్తుంది, పురోగతిని ప్రేరేపిస్తుంది, పరిణామానికి జన్మనిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే, శాస్త్రీయ పరిశోధనలో అంతర్ దృష్టే నిజమైన విషయం. ‘అన్నాడంటే ఇంట్యూషనే విద్యా ప్రమాణమని విద్యా వ్యవస్థ గుర్తెరగాలి. ప్రముఖ రచయిత, కెరీర్ నిపుణురాలు స్టెఫానీ వొజా అంతర్ దృష్టిని దిశాత్మకం ( Directional), సామాజికం ( social), సమాచార పూర్వక (Informational) అను మూడు విభాగాలుగా చర్చించారు.
1.దిశాత్మక అంతర్ దృష్టి: ఇది మిమ్మల్ని మీ అంతర్గత దిక్సూచితో అత్యంత సన్నిహిత మార్గం లో కలుపుతుంది. మీ లెన్స్ లేదా నమ్మక వ్యవస్థపై ఆధారపడి, మీ ఉన్నత- స్వయం, ఆత్మ, దైవిక స్వభావం, ఉపచేతన మనస్సులను అత్యంత సహజంగా క్షేత్ర స్థాయిలో నిర్ణయాలకు గొప్ప మార్గదర్శనం చేస్తుంది. 2. సామాజిక అంతర్ దృష్టి: ఇది వ్యక్తుల మధ్య కమ్యూనిటీల మధ్య క్రియాశక్తి భావోద్వేగాలను, అట్లాగే ఆయా శక్తులు భావోద్వేగ ప్రకంపనలను పసిగట్టగల సామర్థ్యాన్ని ప్రోది చేస్తుంది.సామాజిక అంతర్ దృష్టి కమ్యూనిటీ భద్రత, రక్షణ, సంబంధ బాంధవ్యాలకు మార్గం వేస్తుంది. 3. సమాచార అంతర్ దృష్టి: ఇది విశ్లేషణ, నమూనా గుర్తింపు, నిర్ణయం తీసుకోవడం కోసం పెద్ద మొత్తంలో డేటాను సంశ్లేషించడంతో పాటు సమాచారాన్ని వేగంగా డీకోడ్ చేయగల సామర్థ్యం. ఒక రకంగా ఇది వ్యక్తికి ప్రకృతి ఇచ్చే బహుమతి లాంటిది. ఈ తరహా ఇంట్యూషన్ కలిగినవారు ఉపచేతన మనస్సులో నిల్వ చేయబడిన వాటితో సహా, సమాచారాన్ని అన్ని నమూనాల్లో వేగంగా గుర్తించి అనుభవాలను విశ్లేషించే సహజమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక్కడే DIKW (data Information Knowledge Wisdom) పిరమిడ్ సోపాన క్రమం ఆవృత్తం అవుతుంది.
ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లు, డేటా సైంటిస్టులు, డే ట్రేడర్లు, పరిశోధకులు, ఇన్వెస్టిగేటింగ్ అధికారులు, ఇంజినీర్లు ఇందులో తరచుగా రాణిస్తారు. అంతర్ దృష్టిని గురించి ప్రముఖ వక్త, యాక్టివిస్టు, ‘లైఫ్‌హాక్, టినీ బుద్ధ, థ్రైవ్ గ్లోబల్’ పుస్తకాల రచయిత్రి సారా జీన్ బ్రౌన్ మాట్లాడుతూ ‘శుభ సూచకం ఏమంటే, అంతర్ దృష్టి గేమ్ ఛేంజర్ కావచ్చు. మీరు దీన్ని మీ అంతర్గత స్వరం, అంతర్గత మార్గదర్శకత్వం, అసాధారణ జ్ఞానం, ప్రవృత్తి, గట్ ఫీలింగ్స్, సిక్త్‌సెన్స్ లేదా హంచ్ ఏ విశేషణంతోనైనా పిలవవచ్చు. కొన్నిసార్లు వీటన్నిటి లోపల విషయంగా కూడా అంతర్ దృష్టిని చూడాలి’ అంటుంది. ఆధునిక మనస్తత్వ శాస్త్రం అంతర్ దృష్టిని సమస్యలకు సరైన పరిష్కారాలను కనుగొనే సామర్థ్యంగా, నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిగా పేర్కొంది.
ఇంతకు ముందు అనుకున్నట్టు మనందరికీ అంతర్ దృష్టి ఒక బహుమతి. ఈ బహుమతిలో భాగమే మనకున్న ఎక్స్‌ట్రాసెన్సరీ సామర్ధ్యాలు. ఇవి ప్రధానంగా నాలుగు రకాలు 1. స్పష్టంగా చూడటం (Clairvoyance), 2. స్పష్టంగా వినటం (Clairaudi ence), 3. స్పష్టంగా వాసన, రుచిని అనుభూతి చెందడం (Clairsen tience), 4. స్పష్టంగా తెలుసుకోవటం (Claircogni zance). ఇందులో ఏవేని రెండు ప్రతి మనిషిలో మిగతా రెండిటికంటే బలంగా ఉంటాయి.
ఆ రెండిటిని గుర్తెరిగి ఉపయోగించుకోవడం మూలాన్నే మనలో కొందరు ఇతరులకన్నా భిన్నంగా అభివృద్ధి చెందారు, చెందుతారు. ఇంట్యూషన్ జీవితాలను కాపాడింది, విపత్తులను నివారించింది, ఎన్నో వినూత్న నిర్ణయాలకు కారణమైందంటున్న సుప్రసిద్ధ న్యూరో సైంటిస్ట్ జోయెల్ పియర్సన్’ The Intuition Tool Kit’ గ్రంథంలోని SMILE (Self-awareness, Mastery, Impulses and Addiction, Low Probability, Environment) నియమాలు అనుసరించదగ్గవి. DIKW పిరమిడ్ సోపానాల్లో పైన గల Wisdom ను మించి Intuition- extrasensory సామర్ధ్యాలు వ్యక్తికి తన higher self తో కనెక్ట్ చేయగలవు. ఎక్స్‌ట్రా సెన్సరీ సామర్థ్యాలు ఆహ్లాదకరంగా, ఉత్తేజకరంగా ఉంటాయి. కాబట్టి, అతిక్రమణ లేకుండా గ్రౌండ్‌గా ఉండేలా చూసుకోవడం, చూడటం తప్పనిసరి. ఇక్కడే పిల్లలకు ఉపాధ్యాయుల తోడ్పాటు కీలకం.