శబరిమల (కేరళ) : శబరిమలలోని స్వామి అయ్యప్ప గుడిలో వేలాది మంది భక్తులు బుధవారం స్వామికి పూజలు జరిపారు. వార్షిక యాత్ర సీజన్‌లో 41 రోజుల మొదటి దశ పూర్తి అయిన సందర్భంగా బుధవారం మధ్యాహ్నం పవిత్రమైన పూజ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఊరేగింపుగా సన్నిధానానికి తీసుకువచ్చిన పవిత్ర బంగారు వస్త్రం ‘తంగ అంగీ’ని స్వామి అయ్యప్పకు ధరింపచేసిన తరువాత పూజ నిర్వహించారు. ఆలయం ప్రధాన తంత్రి కందరారు మహేశ్ మోహనారు ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యం నిర్వహించారు. తంత్రి స్వామి అయ్యప్పకు ఆ పవిత్ర అస్త్రాన్ని అలంకరించారు.
ఈ సందర్భంగా ‘కలభాన్హిసేకం’, ‘కలశాభిషేకం’తో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయం అధికారులు వెల్లడించారు. కేరళ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సన్నిధానంలో గంటల తరబడి బారులు తీరి వేచి ఉన్న వేలాది మంది భక్తులతో పాటు ట్రావన్‌కూర్ దేవస్వమ్ బోర్డ్ (టిడిబి) ప్రముఖ అధికారులు కూడా సన్నిధానంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులలో నాగాలాండ్ గవర్నర్ ఎల్ గణేశ్, కేరళ దేవస్వమ్ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్, ఎంఎల్‌ఎ కెయు జెనిష్ కుమార్, టిడిబి అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్, వివిధ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.