హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమితో దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతుందని దేశప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన లేఖలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి అహంకారాన్ని ఆదిలోనే అడ్డుకోని సరైన బుద్ధి చెప్పాలని, సనాతన ధర్మానికి, హిందుత్వం, హిందీ మాట్లాడే ప్రజలకు కాంగ్రెస్ నేతృత్వంలోని పనికి రాని కూటమి రోజు రోజుకూ ప్రమాదంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి అవకాశం దొరికినపుడల్లా భారతదేశ సమైక్యతను అస్ధిరపరిచేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రయత్నిస్తూనే ఉందని, తాజాగా మరోసారి ఈ ప్రయత్నంతో దేశ సమగ్రతపట్ల తనకున్న విద్వేషాన్ని బయటపెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఇటీవలే కాంగ్రెస్ కూటమిలోని డిఎంకెకు చెందిన నేత యూపీ, బిహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడేవాళ్లు, తమిళనాడుకు టాయిలెట్లు కడిగేందుకు వస్తారని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం, ఆక్షేపణీయమన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన కార్మికులు శ్రమనే నమ్ముకుని జీవనోపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళితే వారిని ఇంత నీచంగా అవమానించాల్సిన అవసరం లేదన్నారు. శ్రమజీవులను అవమానించడం, కష్టపడి పనిచేసేవారికి అవహేళన చేయడం కాంగ్రెస్ పార్టీకి, వారితో జత కట్టే వారికి మొదటి నుంచి ఉందని,కుటుంబ రాజకీయాలే తప్ప సమాజం గురించి ఆలోచించడం తెలియని వారినుంచి ఇంతకన్నా గొప్పగా మరేం ఆశించగలమన్నారు. ఇటీవలే జరిగిన పార్లమెంటు చర్చలో రాజకీయ స్వార్థంతో కడుపునిండా ద్వేషాన్ని నింపుకుని మాట్లాడారని వారి అహంకార పూరితమైన మాటలను యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ముందుకు సాగుతున్న తీరు భారతదేశ అంతర్గత భద్రతను ప్రశ్నించేదిగా ఉందని, మెజారిటీ ప్రజల విశ్వాసం, అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తోందన్నారు. దేశ ప్రజలు ఆ కూటమి కుట్రలు గమనించి వచ్చే ఎన్నికల్లో రాజకీయ ఉనికి లేకుండా చేయాలని కోరారు.