న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తొలి జెఎన్.1 కేసు నమోదైంది. బుధవారం మొత్తం ముగ్గురి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా అందులో ఒకరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జెఎన్.1 సోకినట్టు తేలింది. మరో ఇద్దరిలో ఒమిక్రాన్ రకం కరోనా ఉన్నట్టు వెల్లడైంది. అయితే ఢిల్లీలో జెఎన్.1 వేరియంట్ బయటపడటం ఇదే తొలిసారి అని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. దేశంలో బుధవారం కొత్తగా 500 కు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 529 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4093 కు చేరింది.
మంగళవారం ఒక్క రోజు లోనే దేశంలో మూడు కరోనా మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇద్దరు, గుజరాత్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,33,340 కి చేరింది. మొత్తం 4,44,72,756 మంది కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఇదిలా ఉండగా జెఎన్.1 చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 40 జెఎన్.1 వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి వరకు మొత్తం జెఎన్.1 కేసుల సంఖ్య 109 కి చేరింది. అందులో అత్యధికంగా గుజరాత్‌లో 36, కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్‌లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి