Tuesday, December 24, 2024

హరిద్వార్‌లో ఏనుగు దాదాగిరి..

- Advertisement -
- Advertisement -

హరిద్వార్ : స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో ఓ అడవి ఏనుగు దుమారం రేపింది. అక్కడున్న ప్రజలు, లాయర్లు, లోపల ఉన్న వారంతా ఈ ఏనుగు చెలరేగిపోవడంతో కంగుతిన్నారు. ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఏనుగు బుధవారం జిల్లా కోర్టు సాగుతున్న దశలో కోపోద్రిక్తంగా దూసుకువచ్చింది. ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి, లోపలికి చొచ్చుకు వచ్చింది. మధ్యాహ్నం వేళ ఈ ఘటన జరిగింది. అప్పుడే ఉద్యోగులు ఇక ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. లాయర్లు ఫైళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ దశలోనే అనూహ్య రీతిలో ఈ మదపుటేనుగు దూకుడుతనం ప్రదర్శించింది. ఈ కోర్టునే ఇది ఎందుకు టార్గెట్ చేసుకుందనేది వెల్లడికాలేదు. ఈ గజరాజ దాడికి గురైన కోర్టు జిల్లా ఎస్‌పి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉంది. ఈ ఏనుగు దాడిలో ముందు ప్రధాన గేటు పూర్తిగా విరిగిపోవడం , లోపలి ఓ గోడ దెబ్బతింది.

ఈ ఆవరణలో పలు వాహనాలు , మనుష్యులు ఉన్నారు. మనుష్యులకు కానీ ఇక్కడి వాహనాలకు కానీ ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. ఈ ఏనుగు సమీపంలోని రాజాజీ జాతీయ అభయారణ్యం నుంచి తప్పించుకుని వచ్చి ఉంటుందని వెల్లడైంది. కోర్టులోపల ఈ ఏనుగు హంగామా గురించి వెంటనే స్థానిక అటవీ శాఖకు తెలిపారు. దీనితో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దీనిని చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరిపారు. దీనిని అతికష్టం మీద సమీపంలోని అడవుల్లోకి తరలించారు. ఏనుగు బెడద తీరిపోలేదని, అది ఇంకా కోపంగానే ఉందని, ఎప్పుడైనా ఎక్కడైనా స్వైరవిహారానికి దిగొచ్చునని, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖాధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News