Saturday, November 16, 2024

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ రద్దు

- Advertisement -
- Advertisement -

వచ్చే సంవత్సరం హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ రద్దు
ప్రకటించిన సంస్థ నిర్వాహకులు

మనతెలంగాణ/హైదరాబాద్: వచ్చే సంవత్సరం హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌ను రద్దు చేసుకున్నట్టు ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా హుస్సేన్ సాగర్ తీరంలో రేసింగ్ కార్లు దూసుకుపోయాయి. మన దేశంలో మొదటిసారి జరిగిన అంతర్జాతీయ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ చూసేందుకు పలువురు క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్ నగరానికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే 2024, ఫిబ్రవరిలోనూ ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలను మరోసారి హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్వాహకులు గతంలో ప్లాన్ చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో ఫార్ములా ఈ సంస్థ ఈ-ప్రిక్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి 2023, అక్టోబర్ 30వ తేదీన రేసింగ్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం డిసెంబర్ నెల ప్రారంభంలో తెలంగాణలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంతో సమావేశమైంది. అప్పటి నుంచి చర్చలు కొనసాగాయి. ఈ భారీ ఈవెంట్‌కు మరికొన్ని వారాల సమయం మాత్రమే ఉండగా ఈ-రేస్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రతినిధులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ-రేసు టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్ లతో సహా ఇతర ప్రముఖ ప్రపంచ నగరాల్లో నిర్వహించనున్నారు. అయితే తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2024 ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన రేసింగ్ నిర్వహణను రద్దు చేసుకుంటున్నామని ఫార్ములా ప్రతినిధులు ప్రస్తుతం ప్రకటించడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News